మునుపెన్నడూ చూడని సక్సెస్‌... అనితర సాధ్యమైన విజయం. అచ్చొచ్చిన పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో మరో విక్టరీ కొట్టింది ఇస్రో. ఒకే రాకెట్‌ను రెండు రాకెట్ల తరహాలో పనిచేయించింది. ఒకేసారి రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.


వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగాన్ని విజయవంతం చేసింది. తొలిసారిగా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు మొత్తం 8 ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకెళ్ళింది. తొలుత స్కాట్ శాట్ -1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ నౌక... మొత్తం 2గంటల 15 నిమిషాల్లో మరో ఏడింటిని మరో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. నిజానికి ఇస్రో ఒకేసారి పలు శాటిలైట్లను నింగిలోకి పంపడం కొత్తేమీ కాదు. అయితే... ఒకేసారి రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టడం మాత్రం ఇదే తొలిసారి.

 

ఈ ఉపగ్రహాల్లో భారత్‌కు చెందిన వాతావరణ శాటిలైట్‌ స్కాట్‌శాట్-1తో పాటు, అమెరికా, కెనడా, జర్మనీ, అల్జీరియాకు చెందిన 5 ఉపగ్రహాలున్నాయి. వీటి మొత్తం బరువు 675 కిలోలు. ఇందులో స్కాట్‌శాట్‌-1 బరువు 371కిలోలు. 48గంటల 30నిమిషాల కౌంట్‌డౌన్ అనంతరం చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్ ప్రయోగాన్ని... ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశల్లో 32 నిమిషాల్లో పూర్తి చేశారు. 8 ఉపగ్రహాలను వాటి కక్ష్యలోకి చేరవేసే ప్రక్రియ రెండు గంటల 15నిమిషాల్లో పూర్తయింది. ఇస్రో ప్రయోగాలలో ఎక్కువ సమయం తీసుకున్నది ఇదే. ఇది వాణిజ్యపరంగా కూడా లాభాలు తెచ్చిపెట్టగల ప్రయోగం.

 

పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగించిన 17 నిమిషాలకు స్కాట్‌శాట్-1ను భూమికి 730 కి.మీ.ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాకెట్‌ను కిందకు రప్పించి 689 కి.మీ.ల ఎత్తులోని కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవటంతో ఇస్రోలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అంతరిక్ష శాస్త్రవేత్తలు అమితానందం వ్యక్తం చేశారు.


ఈ ఉపగ్రహాలతో వాతావరణ పరిస్థితులను, విపత్తులను మరింత కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంది. సునామీలను, తుపానులను గుర్తించడం, గాలి ఉధృతిని గమనించడం వంటి కీలక వాతావరణ సమాచారాన్ని స్కాట్‌శాట్-1 ద్వారా పొందవచ్చు. చాలా దేశాలకు ఇంతవరకు ఒకే కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల సామర్థ్యం ఉంది. అందుకే వేర్వేరు కక్ష్యలలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. అయితే.. భారత్ ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొంది. ఇంతకు ముందు ఈ ఘనతను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే సాధించింది.

 

జఠిలమైన ఈ ప్రయోగాన్ని సక్సెస్‌ చేసిన ఇస్రోను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఇస్రో శాస్త్ర వేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఈ సక్సెస్‌ అందించిన ఉత్సాహంతో  ఇస్రో .. వచ్చే నెల తొలి వారంలో మరో కీలక ప్రయోగం చేయబోతోంది. నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాన్ని అత్యంత బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: