అన్ని సంఘటనలూ డిల్లీ లోనే జరుగుతాయో లేక డిల్లీ లో జరిగిన సంఘటనలు మాత్రమే హై లైట్ అవుతాయో తెలీదు కానీ ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించిన దాడులులో  మాత్రం డిల్లీ కేంద్ర బిందువు గా మారుతూ ఒస్తోంది. నిర్భయ ఉదంతం నుంచీ నిన్నటి కరుణ ఉదంతం వరకూ అన్నీ డిల్లీ లోని మహిళా భద్రత ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఉత్తర డిల్లీ లోని బురారి ప్రాంతంలో సురేందర్ సింగ్ అనే ఆగంతకుడు కరుణ అనే టీచర్ ని పట్టపగలు, సీసీ కెమెరాల మధ్యలోనే నడి రోడ్డు మీద ఇరవై సార్లు పొడిచి చంపాడు. బిజీ గా ఉండే రోడ్డు మీద జనం కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది. ఆమెని ఆ హంతకుడు ఏడాదిగా వెంటాడి వేధిస్తున్నాడు అని అంటున్నారు. ఆమెకి తన లవ్ ప్రోపోజల్ చెయ్యగా ఆమె వెంటనే నిరాకరించింది అనీ పోలీస్ స్టేషన్ లో అతని టార్చర్ తట్టుకోలేక ఫిర్యాదులు కూడా అందాయి అనేది కొందరి నుంచి తెలుస్తున్న సమాచారం.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందిన తరవాత అతన్ని కేవలం మందలించి వదిలేసారు అనీ అలాంటి ఉన్మాది ఈ రోజు ఇంతటి ఘాతకానికి తేగాబడతాడు అని పోలీసులు కూడా ముందే ఊహించలేదు అనీ, అతనికి గతం లో ఎలాంటి నేర చేరితా లేనికారణంగా నే ఇది జరిగింది అని అంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే హంతకుడు ఇంకా ఇంకా రెచ్చిపోయాడు కావచ్చు. పట్టపగలే కత్తులతో అన్ని సార్లు పొడిచి , అతని కాళ్ళతో చచ్చిపోయిన ఆమెని విపరీతంగా కసితీరా తన్ని పారిపోయాడు అంటే అతను ఎంత పెద్ద సైకో అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతోంది. 2015 సంవత్సరం లో మాత్రమే ఇలాంటి ఆగంతకుల దాడులు 1124 నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది అంచనా వెయ్యచ్చు. ఇదే డిల్లీ లో రెండు రోజుల కిందట ఒక హత్య జరిగింది. అది కూడా సీసీ టీవీ లలో రికార్డ్ అయ్యింది. ప్రేమ పేరుతో వెంటపడి ఒప్పుకోమంటూ విసిగించడం, ఎక్కడికి వెళితే అక్కడికి వెంటే వచ్చి తాను లేకపోతే చచ్చిపోతా అంటూ బెదిరించడం, ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఎదుటివారి ప్రాణాలే తీయడం ఇదంతా కలికాలపు ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రాణాలు తీయడం , యాసిడ్ దాడి చెయ్యడం హేయమైన ఘటనలు గా చూడాలి.

ఇలాంటి సంఘటనలలో చుట్టూ ఉన్న వారు , ఆ టైం కి అక్కడే ఉన్న అనామకులు ఏ మేరకు ఆడపిల్ల ని రక్షించాలి అని గానీ - రక్షించాల్సిన బాధ్యత తమ మీద ఉంది అని గానీ ఆలోచిస్తున్నారు ? తాజాగా జరిగిన డిల్లీ ఉదంతం లో ఆమెని ఆ కుర్రాడు పొడుస్తూ ఉంటే చుట్టుపక్కల కనీసం ఎనిమిది మంది వరకూ నడుచుకుంటూ వెళ్ళిపోవడం దారుణమైన విషయం. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా వెంటనే అతన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఒక నలుగురు అప్పటికప్పుడు కూడా బలుక్కుని అతని మీద దాడి చేస్తే అతను కాళ్ళకి పని చెప్తాడు. చంపడం దాకా ఒచ్చినప్పుడే జనాలు రెస్పాండ్ కాకపోతే వేధింపుల విషయం లో వారు అసలు ఏం మాట్లాడతారు ? అందరూ సామూహికంగా ఒక్కసారి అడ్డం పడ్డం, ప్రశ్నించడం మొదలు పెడితే ఎంతటివాడు అయినా నోరు మూసుకుంటాడు లేదా పారిపోతాడు.  బహిరంగంగా స్త్రీలను హింసించే వేధించే ఘటనలు ఏవైనా సరే ఎవరైనా అడ్డుకోవచ్చు. వారి సంబంధమేమిటని సంకోచించనవసరం లేదు.

అలాగే సామూహికంగా అడ్డుపడితే దుండగులు ఎంతవారైనా చేయగలిగింది వుండదు. ఆ విషయం లో అందరూ దృష్టి పెట్టాల్సి ఉంది. అవగాహన , ఆలోచన ఒక్కసారిగా ఏర్పరచుకుని కర్తవ్యం నిర్వహించాల్సిన తరుణం అది. అది మనందరి బాధ్యత అనేది గుర్తించాలి. ఇబ్బంది పడుతున్న వ్యక్తి మనకి వరస అవ్వాల్సిన అవసరం లేనేలేదు. ఆడైనా , మగైనా సమాజం లో ఉన్నంత సేపూ మన రేస్పాన్సిబులిటీ నే మరి. మగ , చిన్న పిల్లలు , ముసలి వాళ్ళ విషయం లో బాగానే రియాక్ట్ అవుతాం కానీ లేడీస్ మీద వేధింపుల పర్వం లో రియాక్షన్ లు డిఫరెంట్ గా ఉంటాయి. అది తరవాత మన మెడకి చుట్టుకుంటుంది ఏమో అని లేదా ఈ సన్నివేశానికి ముందర ఆమె ఏం చేసిందో మనకి తెలీదుగా అంటూ జడ్జ్మెంట్ పాస్ చేసి ఊరుకుంటాం. చివరికి ఆమెని దారుణంగా చంపుతున్నప్పుడు కూడా జనం సైలెంట్ గా ఉండడం దారుణమైన విషయం. పోనీ అతను సైకో కాబట్టి అతనికి దూరంగా ఉండాలి అనేది వారి భయం అయినా కూడా ముగ్గురు నలుగురు కూడ బలుక్కుంటే ఎవ్వరూ చెయ్యగలిగింది ఏమీ లేదు.

దూరం నుంచి రాళ్ళు గట్రా విసిరేసి అయినా ఆమెని కాపాడి ఉండాల్సింది. ఫోన్ తీసి అతన్ని చిత్రీకరిస్తూ ఉంటే భయపడి వెంటనే పారిపోతాడు కూడా. నలుగురు సామాన్యుల బలం ముందు ఒక ఉన్మాది , ఉగ్రవాది కూడా నిలవడు అని గుర్తుంచుకోవాలి. అన్నిటినీ మించి ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆడపిల్ల బాధ్యత మనం తీసుకోవడం తప్పేమీ కాదు దానికి హీరోయిజం అక్కర్లేదు ఆలోచించ గలిగే బుర్ర , బాధ్యతాయుతమైన మనసు ఉంటె చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: