గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణలో నిర్వహించిన నాలుగు సభలు విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలలో గెలుపు ధీమా కలిగిందని చెప్పవచ్చు. తెలంగాణలో ఒకే రోజు రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆ పార్టీ అగ్ర నేతలు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలచిన కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో బిజెపి బహిరంగ సభలు నిర్వహించింది. వీటిలో నరేంద్ర మోడీ సభలో తొలి సారిగా మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొనడం హైలెట్‌గా నిలచింది. మోడీ నాలుగు చోట్ల జరిగిన బహిరంగ సభలలోనూ కాంగ్రెస్‌పై ప్రధానంగా విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఆ పార్టీ పదేళ్ల పాలనను ఎండగడుతూ ప్రసంగించిన సమయంలో ప్రజలు ముఖ్యంగా యువకుల నుంచి విశేష స్పందన లభించింది. యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను గతంలో ఎన్డీయే ప్రభుత్వమే కల్పించిందనీ, తిరిగి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వారి దశ తిరుగుతుందని యువకులలో బిజెపిపై విశ్వాసం కలిగింపజేసే ప్రయత్నం చేశారు. గుజరాత్‌ తరహా అభివృద్ధిని తనకు కేంద్రంలో అధికారం ఇస్తే తెలంగాణలో చేసి చూపిస్తానని చెప్పడం ద్వారా అభివృద్ధికి ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఈసభలకు హాజరైన సంగతిని దృష్టిలో ఉంచుకుని తనకు అధికారం ఇస్తే వందలాది మంది పవన్‌ కల్యాణ్‌లను తయారు చేస్తానని చెప్పి ఆయన అభిమానులను ఆకట్టుకున్నారు. మరోవైపు, దాదాపు పదేళ్ల తరువాత మోడీతో వేదికను పంచుకున్న టిడిపి అధినేత చంద్రబాబు సైతం తన ప్రసంగంలో మోడీని ప్రశంసించడం ద్వారా ఆయనే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందనీ, తిరిగి అభివృద్ధి బాటలో పయనించాలంటే ఆ పార్టీకి ఎట్టి పరిస్థితులలోనూ ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో దేశంలో, రాష్ట్రంలో అవినీతి అనకొండలా పెరిగిందనీ, అదే ఎన్డీయే, టిడిపి ప్రభుత్వాలు ఉన్న సమయంలో అభివృద్ధి చోటు చేసుకుందని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్‌ పార్టీకి దేశాన్ని పాలించే సత్తానే లేదనీ, ఆ పార్టీలో దేశాన్ని పాలించే స్థాయి నాయకులు ఎవరూ లేరని విమర్శలు గుప్పించారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం ముఖ్యంగా యువకులను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీతో పాటు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను కూడా తన ప్రసంగంలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగు జాతిని, తెలుగు ప్రజలను విడగొట్టిందని విమర్శించారు. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో విడిపోయిన రాష్ట్రాల ప్రజలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారనీ, కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. ఇక టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సీమాంధ్ర నేతలు, ఆ ప్రాంతానికి చెందిన పార్టీలపై విమర్శలు చేయడాన్ని పవన్‌ ఖండించారు. ఏ ప్రాంతానికి చెందిన ప్రజలైనా దేశంలో ఎక్కడైనా నివసించవచ్చనీ, ఏ ప్రాంతానికి చెందిన నేతలైనా దేశంలో ఎక్కడి నుంచయినా పోటీ చేయవచ్చని ఈ విషయాన్ని కెసిఆర్‌ గ్రహించాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సమగ్రతను, ప్రయోజనాలనే పణంగా పెట్టిందనీ, అలాంటి పార్టీకి ఎట్టి పరిస్థితులలోనూ ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. చివరగా ఎప్పటి లాగానే ఆయన కాంగ్రెస్‌ హఠావో-దేశ్‌ బచావో నినాదాన్ని ఇవ్వడం ద్వారా యువతను బాగా ఆకర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: