మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు! మహారాష్టల్రో భాజపా తన బలాన్ని గత ఎన్నికలలో కంటె దాదాపు మూడు రెట్లు పెంచుకున్నప్పటికీ శాసనసభలో ఆ పార్టీకి స్పష్టమైన ‘మెజారిటీ’ రాలేదు! రాదన్నది ఎన్నికల ‘పోలింగ్’నకు పూర్వం ‘సర్వే’ల వల్ల నిర్ధారణ జరిగిన మహావిషయం! ‘పోలింగ్’ ముగిసిన తరువాత జరిగిన సర్వే కూడ ఈ నిర్ధారణను ధ్రువపరిచింది! ‘్భజపా’ ‘అగ్రగామి’గా అవతరిస్తుందన్న అంచనా నిజమైంది! అందువల్ల మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యకరం కాదు! హర్యానాలో సైతం ‘భజపా’ అగ్రగామిగా అవతరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వెలువడిన ఫలితాలు మాత్రం ఆ పార్టీకి, దేశ ప్రజలకు అమిత ఆశ్చర్యాన్ని హర్షాన్ని కలిగిస్తున్నాయి! హర్యానా శాసనసభలో ఆ పార్టీకి పూర్తి మెజారిటీ లభించడం ఈ హర్షానికీ ఆశ్చర్యానికీ కారణం! ఇలా రాజకీయ జ్యోతిషవేత్తల అంచనాలు, జనాభిప్రాయ సేకరణల ఫలితాలు నిజమయ్యాయి, తప్పాయి కూడ! మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ‘భరతీయ జనతా పార్టీ’ అగ్రగామి అన్న అంచనాలు నిజమయ్యాయి. హర్యానాలో ‘త్రిశంకు’ శాసనసభ ఏర్పడుతుందన్న ఊహాగానాలు తప్పని ఫలితాలు నిరూపించాయి! హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి గురి కావడం ఖాయమని తెలిసిపోయినప్పటికీ ఇంతగా దిగజారి మూడో స్థానానికి పడిపోతుందన్నది ‘పోలింగ్’ పూర్వ విశే్లషకులు కనిపెట్టలేకపోయిన వ్యవహారం! కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లునికి కాంగ్రెస్ నాయకత్వంలోని భూపేందర్ సింగ్ హుడా ప్రభుత్వం అక్రమంగా ఆస్తులను కట్టబెట్టిందన్న ‘ఆరోపణ’ పార్టీని రెండేళ్లుగా వెంటాడుతోంది, ఈ శాసనసభ ఎన్నికలలో వేటాడింది! అవినీతిని, అధికార అవినీతిని, రాజకీయ అవినీతిని జనం గమనించజాలరన్నది ‘నిర్వాహకుల’ భ్రాంతి మాత్రమేనన్నది హర్యానా ఎన్నికలలో మరోసారి ధ్రువపడింది! ‘అగ్రగామిగా’ మాత్రమే అవతరించగలదని అందరూ భావించిన ‘జపా’ ఘనవిజయం సాధించడానికి ఇది ప్రధాన కారణం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాకర్షక శక్తి మరో కారణం! పదేళ్ల పాలన తరువాత కాంగ్రెస్ హర్యానాలో ఓడిపోవడం ఆశ్చర్యకరం కాదు! పదేళ్ల తరువాత జనం మార్పును కోరుకుంటారు! కానీ ప్రధాన ప్రతిపక్షం హోదాను సైతం కాంగ్రెస్ పోగొట్టుకొనడమే ఆశ్చర్యకరం! ఈ ఆశ్చర్యకరమైన పరిణామానికి సైతం కారణాలు ఈ రెండే! అధికారం చెలాయించిన సమయంలో కాంగ్రెస్ వారి అవినీతి, నరేంద్ర మోదీ పట్ల హర్యానాలో పెరిగిన ప్రజాభిమానం. చరిత్రలో మొదటిసారిగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది! హర్యానా రాజకీయాలలో ఇంతకాలం ప్రభుత్వ నిర్మాణాలలో, నిర్వహణలో కీలక పాత్రలను పోషించిన ‘చౌతాలా’, ‘్భజన్‌లాల్’ కుటుంబాల ప్రాధాన్యం తగ్గిపోవడం మరో మహా పరిణామం! భారతీయ జనతాపార్టీ కేంద్ర బిందువుగా వ్యవస్థీకృతవౌతున్న ‘జాతీయ రాజకీయం’ మరింత బలపడడం ఇలా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో సంభవించిన ప్రధాన పరిణామం! ఎదురులేని జాతీయ రాజకీయ శక్తిగా ‘్భజపా’ ఎదిగిపోయిందని మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ధ్రువపరిచాయి! ఈ రెండు రాష్ట్రాలలోను ‘అనుసరించే పార్టీ’గా ఉండిన ‘భజపా’ ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ‘అగ్రగామి’గా అవతరించడం భారత రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం కలిగిస్తున్న శుభ పరిణామం! జాతీయతా నిష్ఠ కల ‘రాజకీయ పక్షం’ కేంద్ర బిందువు కావడం ‘జాతీయతా నిష్ఠ’ను నిర్లక్ష్యం చేసిన రాజకీయ పక్షం ప్రాధాన్యం కోల్పోవడం ఈ శుభ పరిణామ చిహ్నం! ‘జాతీయతా నిష్ఠ’ పట్ల శ్రద్ధ లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దుల తరబడి రూపొందిన విపరిణామం! లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఘోర పరాజయం పాలుచేసిన ఈ ‘విపరిణామం’ ఈ శాసనసభ ఎన్నికల్లో మరింతగా ప్రస్ఫుటించింది! మహారాష్ట్ర కాంగ్రెస్ కంచుకోట! హర్యానా కూడ కాంగ్రెస్‌కు దశాబ్దులుగా సడలని ప్రాబల్య కేంద్రం! ఈ రెండు రాష్ట్రాలలోను కాంగ్రెస్ అధికారంలో ఉండినప్పుడు, ప్రతిపక్షంలో ఉండినప్పుడు కూడ కాంగ్రెస్ కేంద్ర బిందువు! దశాబ్దుల చరిత్ర ఇది! ఈ ‘ప్రాభవం’ ఇప్పుడు గతమైపోయింది! కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలోను మూడవ స్థానానికి దిగజారిపోయింది! ఏప్రిల్, మే నెలలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు ఈ రెండు రాష్ట్రాలలోను ‘్భజపా’కు రెండవ స్థానం కూడ లేదు! మహారాష్టల్రో కాంగ్రెస్- జాతీయతా కాంగ్రెస్ కూటమి గత పదిహేను ఏళ్లుగా అధికారం చెలాయించిన సమయంలో ‘్భజపా’ శివసేనను అనుసరించిన ‘చిన్న పార్టీ’! 2009 నాటి లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలో భాజపాకు దక్కింది కేవలం తొమ్మిది శాతం వోట్లు! ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీకి హర్యానాలో ముప్పయి ఐదు శాతం వోట్లు లభించడం అపూర్వ ప్రగతి వేగానికి చిహ్నం! ఈ ‘వేగం’ ఈ శాసనసభ ఎన్నికల ఫలితాల తరువాత స్థిరపడింది! నూట ఇరవై నాలుగు స్థానాలతో అగ్రగామిగా నిలిచిన ‘భజపా’ మహారాష్టల్రో ఇప్పుడు అతి పెద్ద పార్టీ! భాజపా నాయకత్వంలో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్నది ప్రధాన విషయం కాదు! మహారాష్ట్ర రాజకీయాలలో ఇన్నాళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ శివసేనల ప్రాబల్యం ‘కొడిగట్టుకుపోవడం’ ప్రధాన పరిణామం. రెండు వందల ఎనబయి ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభలో అరవై రెండు స్థానాలు సాధించగలిగిన శివసేన రెండవ స్థానంలో నిలచింది! కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి దిగజారిపోవడం మహారాష్టల్రో ఇది మొదటిసారి! జాతీయ రాజకీయాలలో ప్రాధాన్యం కోల్పోయి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం పోగొట్టుకున్న కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ఈ పరిణామం కొత్త నష్టం కాదు! పదిహేను ఏళ్లు అధికారం చెలాయించిన పార్టీలు ఆ తరువాత ఎన్నికలలో ఓడిపోవడం కూడ దేశ రాజకీయాలలో కొత్త కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వివిధ రాష్ట్రాలలో మూడవ, నాలుగవ స్థానాలకు దిగజారిన కాంగ్రెస్‌కు ఆయా రాష్ట్రాలలో మొదటి రెండు స్థానాలు లభించడం సమీప భవిష్యత్తులో అసంభవం. ఇదంతా ఇప్పుడు కొత్త విషయం కాదు! మహారాష్టల్రో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉండిన శివసేన ఆ స్థానాన్ని కోల్పోవడమే కొత్త పరిణామం! ‘చిన్న పార్టీలను ధ్వంసం చేయడానికి భాజపా కంకణం కట్టుకుని ఉంది...’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ థాకరే ఆరోపించారు! ఈ ఆరోపణ మహారాష్టల్రోను హర్యానాలోను కూడ ఆదివారంనాటి ఫలితాల తరువాత నిజమైంది! ఇలా ‘నిజం’ కావడం నిజానికి భారత రాజకీయాలలో శుభ పరిణామం! లోక్‌సభ ఎన్నికలలో గణనీయమైన స్థానాలను పొంది ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాలను ‘కుక్కను ఆడించిన తోక’లవలె పనిచేయడం 1996 నుండి 2014 వరకు నడిచిన కథ. ఇప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడింది! హర్యానాలో ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోంది! శివసేన కనుక భాజపాకు సగం సీట్లు కేటాయించి ఉండినట్టయితే మహారాష్ట్ర ఎన్నికలలో ఉభయ పార్టీల కూటమి రెండు వందలకుపైగా సీట్లు గెలుచుకుని ఉండేది! కానీ అప్పుడు భాజపా మాత్రం శివసేనను ‘అనుసరించే’ పార్టీగానే మిగిలి ఉండేది. ఇప్పుడు మళ్లీ పొత్తు కుదిరినా భాజపా అధికారంలో పెద్ద భాగస్వామి! ఇలా జాతీయ పక్షం ప్రభావం పెరగడం జాతీయ రాజ్యాంగ వ్యవస్థకు మరింత సుస్థిరత్వాన్ని చేకూర్చే పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: