పొలిటికల్ స్టార్ చిరంజీవి మరోసారి గళం విప్పారు. తమ్ముడు పవన్ కల్యాణ్ కాస్తో కూస్తో దూసుకుపోతున్నా.. కాంగ్రెస్ లో ఉన్న పాపానికి తాను వెనుకబడ్డాననుకున్నారో.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అనుకున్నారో కానీ.. అనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచారయావ తప్ప ప్రజాసేవపై ఆసక్తి లేదని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విమర్శించారు. అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు సంధించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో మొదటి సంతకానికే విలువలేకుండా చంద్రబాబు వ్యవహించారని విమర్శించారు. కోటయ్య కమిటి, సాధికార సంస్థ అంటూ ఇంకా ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు... వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటంలో కేంద్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్నారు మెగాస్టార్.. కేంద్రం తీరు అలా ఉంటే... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా కానీ... కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గానీ ఈ విషయంలో మాట్లాడకపోవటం దారుణమన్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఏపీ రాజధాని అంశంపైనా మెగాస్టార్ విమర్శలు గుప్పించారు. కేపిటల్ కోసం పచ్చని పంటలు పండే భూములు సేకరిస్తున్నారని, రైతుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం లేకపోయినా... ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా ఆందోళనలు చేస్తామన్నారు. అంతా బాగానే ఉంది కానీ... చిరంజీవి ఇలా అప్పుడప్పుడు ఆవేశపడం.. పార్టీ వేదికలపై మాట్లాడటమే కాకుండా.. కాస్త జనంలోకి వచ్చి ఆందోళనలు చేస్తే బావుంటుందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు..

మరింత సమాచారం తెలుసుకోండి: