అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలు అయినా సరిగా కాలేదు.. అప్పుడే ముఖ్యమంత్రిగా బాబు విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారట ఏపీ క్యాబినెట్ మంత్రులు. ఈ మేరకు వారు చంద్రబాబుకే సూటిగా సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. బాబుపై తమకు ఉన్న ఫిర్యాదులను చెప్పుకొని వారు మారాలని సూచించారట! అందుకు స్పందిస్తూ తెలుగుదేశం అధ్యక్షుడు కూడా సరే.. అన్నారని తెలుస్తోంది. తాజా క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశం గురించి గట్టిగానే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. తమకు ముఖ్యమంత్రి సరిగా అందుబాటులో ఉండటం లేదనేది మంత్రుల ఫిర్యాదు. పాలన పరుగులెత్తించాలని సూచిస్తున్న ముఖ్యమంత్రి తమకు సరిగా అందుబాటులో ఉండటం లేదని వారు ఆయన ముందే కుండ బద్ధలు కొట్టేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులేమో విదేశీ పర్యటనలు ... మరికొన్ని రోజులేమో జిల్లాల పర్యటనలు చేస్తూ చంద్రబాబు తమకు టచ్ లో ఉండటం లేదని మంత్రులు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీనిపై బాబు స్పందించారట. ఇక నుంచి అలా ఉండదని.. ప్రతి శనివారం క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడం లేదా మంత్రులకు అందుబాటులో ఉండటం జరగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఈ విషయంలో మార్పు కనిపిస్తుందని బాబు అన్నారని తెలుస్తోంది. అయితే ఇది సాధ్యమా? అనేదే ఇక్కడ సందేహం. బాబు క్యాబినెట్ ఇప్పటికే మంత్రులకు పెద్దగా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని టాక్. ప్రత్యేకించి చినబాబు లోకేష్ జోక్యంతో మంత్రులు అచేతనులు అవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైనా చెప్పుకొందామంటే బాబు కూడా అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. మరి ఏం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: