ఆటో పరిశ్రమలో మునుపెన్నడూ లేనివిధంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాంతీయ‌, దేశీయ కంపెనీల‌నే తేడా లేకుండా ప్ర‌ముఖ కంపెనీల‌న్ని ఉత్ప‌త్తులు త‌గ్గించుకోవ‌డం, నిలిపివేయ‌డం, ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి. గడిచిన 2-3 నెలల్లో వాహన తయారీ సంస్థల్లో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉపాధిని కోల్పోగా, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఏకంగా 2 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారంటే..ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ ఉత్పత్తి 12.03 శాతం, హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 18.5 శాతం, టీవీఎస్ మోటర్ 8.07 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 22.35 శాతం తయారీని తగ్గించేశాయి.


మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఈ నెల 15 నుంచి 18 వరకు ఉత్పత్తిని నిలిపి వేసింది. టాటా మోటర్స్ సైతం ఈ నెల 16, 17 తేదీలను వర్క్ హాలిడేలుగా ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 1న, 8 నుంచి 10 వరకు వాహనాల తయారీని సంస్థ ఆపేసింది. దీంతో పుణె, జంషెడ్‌పూర్ ప్లాంట్లు తెరుచుకోలేదు. వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ కూడా గడిచిన రెండు నెలల్లో 9 రోజులు ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ నెలలో 17, 19 తేదీలను ఉత్పత్తి విరామంగా ప్రకటించింది. ఇదే క్రమంలో టీవీఎస్ మోటర్ 16, 17 తేదీల్లో తయారీని ఆపేయగా, టయోటా 8 రోజులు నిలిపివేసింది. తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్లాంట్లలో 13 రోజులు ఉత్పత్తిని అపేస్తున్నట్లు బాష్ ప్రకటించింది. అలాగే వాబ్కో 19, జమ్న ఆటో 20 రోజుల చొప్పున తయారీని నిలిపేస్తున్నాయి. 


అమ్మకాల పతనం ప్రభావం.. పరిశ్రమలోని పెట్టుబడులపైనా పడుతున్నది. ఆటో కంపోనెంట్ సంస్థలు తమ పెట్టుబడులను భారీగా తగ్గించేస్తున్నాయి. కొన్ని సంస్థలు పెట్టుబడుల ప్రతిపాదనల్ని వెనక్కి కూడా తీసుకుంటున్నాయి. భారత్ ఫోర్జ్, లూమాక్స్ ఇండస్ట్రీస్ తదితర ప్రధాన సంస్థల పెట్టుబడులు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ప్రస్తుత మార్కెట్ మందగమనం దృష్ట్యా వర్క్ హాలిడేలను ప్రకటించింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్లలో 8 నుంచి 14 రోజులు వాహన తయారీని అపేస్తున్నట్లు స్పష్టం చేసింది. హ్యూందాయ్ మోటర్ కూడా శ్రీపెరంబుదూర్ ప్లాంట్లో ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో విడుతలవారిగా తయారీకి విరామం ఇస్తున్నట్లు తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: