గత సంవత్సరాలుగా జరుగుతున్న అయోధ్య వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు కృషి చేసిన మధ్యవర్తుల బృందాన్ని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ఈ అంశంలో రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం వీరు చేసిన కృషిని సుప్రీంకోర్టు అభినందించింది. ఈ బృందం కేసుకు సంబంధించిన కక్షిదారులతో చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయింది. శనివారం ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు వీరు చేసిన కృషిని  అభినందించింది. ఆ ముగ్గురి నేపథ్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 


శ్రీ శ్రీ రవిశంకర్ నేపథ్యం 
శ్రీశ్రీ రవిశంకర్ 1956లో తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. సుమారు 7 సంవత్సరాల క్రితం మార్చిలో ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తమ ఆశ్రమం ప్రారంభించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన బోధనలు చేస్తుంటారు. ట్రస్టు ద్వారా స్వచ్ఛంధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జస్టిస్ ఖలీఫుల్లా నేపథ్యం
జస్టిస్ ఖలీఫుల్లా తమిళనాడులోని శివగంగై జిల్లా కరైకూడికి చెందిన వారు సుప్రీం కోర్టు జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ ఖలీఫుల్లా(రిటైర్డ్) దివంగత జస్టిస్ ఎం ఫకీర్ కుమారుడు. ఆయన వయసు 68 ఏళ్లు. బీసీసీఐ పనితీరులో మార్పులకు సంబంధించిన ఆదేశాలను ఇచ్చిన బెంచ్‌లో ఆయన అప్పటి చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో పాటు ఉన్నారు. ఆయన 2000 మార్చిలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఏప్రిల్ లో అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబరులో అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఖలీఫుల్లా నాలుగేళ్లకు పైగా ఆ బాధ్యతల్లో కొనసాగారు. 2016 జులై 22న పదవీ విరమణ చేశారు. మద్రాస్ హైకోర్టులో జడ్జిగా నియమితులు కాక ముందు జస్టిస్ ఖలీఫుల్లా 'టీఎస్ గోపాలన్ అండ్ కో' అనే న్యాయసేవల సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. కార్మిక చట్టాల కేసులు వాదించడంలో తనదైన ప్రత్యేకత ఉన్న ఆయన, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తరపున వాదనలు వినిపించారు. 


శ్రీరాం పంచూ నేపథ్యం 
శ్రీరాం పంచూ ఒక సీనియర్ అడ్వకేట్. పంచూ 'ద మీడియేషన్ చాంబర్స్' వ్యవస్థాపకులు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మీడియేటర్స్(ఐఎంఐ)కి శ్రీరాం పంచూ అధ్యక్షులుగా ఉన్నారు. 2005లో ఆయన భారత దేశంలో కోర్టుతో సంబంధం ఉన్న మొదటి మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ చట్ట వ్యవస్థ, అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం నెరపడంలో శ్రీరాం పంచూ సమర్థమైన పాత్రను పోషించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో వ్యాపార, పారిశ్రామిక వివాదాలను పంచూ సెటిల్ చేశారు. కుటుంబ ఆస్తుల వివాదాల నుంచి దివాలా, పారిశ్రామిక పోటీ, ఐటీ వివాదాలు, మేధో సంపదకు సంబంధించిన కేసులలో కూడా మధ్యవర్తిత్వం చేయడంలో ఆయన సఫలం అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: