తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోని ప్రయోజకులవ్వాలని యూనివర్శిటీకి పంపిస్తుంటే.. యాజమాన్యం మాత్రం వారిని సమాధుల్లో పడుకోబెడుతోంది. వామ్మో సమాధులేంటి అనుకుంటున్నారా..! అయితే పూర్తిగా చదవండి మరి..! దీని వెనుక మంచి కారణమే ఉందని ఆ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. కానీ, ప్రపంచంలో ఇప్పటివరకు ఏ యూనివర్శిటీ ఎంచుకోని మార్గాన్ని ఈ యూనివర్సిటీ ఎంచుకోవడం వల్ల ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.


విద్యార్థులు పరిక్షలు అంటే భయం, వత్తిడి, టెన్షన్ ఇలాంటివి సహజమే మరి.. కానీ, ఆ టెన్షన్ ను దూరం చేసేందుకు విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు నెదర్లాండ్‌లోని నిజ్మాజెన్ నగరంలో గల రాడ్‌బౌడ్ యూనివర్శిటీకి వింతైన ఆలోచన వచ్చింది. అదే ధ్యాన సమాధి (మెడిటేషన్ గ్రేవ్) అంటారని యూనివర్శిటీ అధికారులు తెలుపుతున్నారు. 30 నిమిషాల నుంచి 3 గంటల సేపు ఈ సమాధిలో ధ్యానం చేసుకోడానికి విద్యార్థులకు అవకాశం ఇస్తామని ఆ యూనివర్సిటీ పేర్కొంది. పచ్చని చెట్ల మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో ఈ సమాధిని ఏర్పాటు చేశామని తెలిపింది.


పరీక్షల సమయంలో విద్యార్థులు కాస్త ఒత్తిడికి గురికావడం వాస్తవమే.. అయితే, వారి ఒత్తిడిని దూరం చేయడానికి యూనివర్సిటీలు అనేక విధానాలు అమలు చేస్తున్నాయి. ప్రశాంతమైన ప్రదేశాలలో యోగా, ధ్యానం వంటి మార్గాలను ఎంచుకుంటున్నాయి. కానీ ఈ యూనివర్సిటీ మాత్రం తమ క్యాంపస్‌లో ఆరు అడుగుల సమాధి తవ్వి.. విద్యార్థులను అందులో పడుకోమని చెబుతోంది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా అందులో ధ్యానం చేయాలని, దీనివల్ల మనసుకు ప్రశాంతత ఏర్పడి, ఏకాగ్రత లభిస్తుందని చెబుతోంది.  ఈ సమాధి లోపల మట్టిపై పడుకోవల్సిన అవసరం లేదు. ఇందులో పడుకొనేందుకు యోగా మ్యాట్‌ను పరిచారు. దానిపై ‘అసహజంగా ఉండండి’ (Stay weird) అని రాశారు. విద్యార్థులకు మాత్రం ఇది భలే నచ్చేసింది. ఆ సమాధుల్లో పడుకొని ధ్యానం చేయడానికి ‘‘నేను ముందు అంటే నేను ముందు’’ అని ఎగబడుతున్నారు. కాసేపు అందులో పడుకొని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు.


ఈ సందర్భంగా సీన్ మెక్‌లాఫ్లిన్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నేను, నా హౌస్‌మేట్ ఈ వారం ఆ సమాధిలో పడుకోవాలని ఓ వారం కింద ప్లాన్ చేసుకున్నాం. అయితే, అందులో పడుకోవడం కోసం పెద్ద వెయిటింగ్ లిస్టు ఉంది. ఈ సమాధికి ఇంత పాపులారిటీ వస్తుందని అనుకోలేదు. అందుకే, ఈ ఛాన్సును వదులుకోవాలని అనుకోవడం లేదు. తప్పకుండా ఒక రోజు ఆ సమాధిలోకి వెళ్తా’’ అని తెలిపాడు. మీకు కూడా పరీక్షల ఒత్తిడి లేదా మరేమైనా ఒత్తిళ్లు ఉంటే ఓ సమాధి తవ్వుకొని అందులో పడుకోండి. కానీ, అది తాత్కాలిక నిద్ర కోసమే..!!


మరింత సమాచారం తెలుసుకోండి: