రెండు తలల గొర్రెలు, దూడలు పుట్టాయనే వార్తలను, ఫొటోలను మనం తరచూ చూస్తుంటాం. అవి పుట్టగానే చనిపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ 'డౌ' అనే పిల్లి కూన మాత్రం చాలా గట్టిది. దీనికి రెండు తలలు, రెండు నోళ్లు, మూడు కళ్లు ఉన్నాయి. పిల్లుల్లో ఇలాంటివి పుట్టడం చాలా అరుదని, పుట్టినవి కూడా వెంటనే చనిపోతుంటాయని పశువైద్యులు చెబుతున్నారు. 


ఇంతకి ఈ పిల్లికూన కాలిఫోర్నియాలో పుట్టింది. ఈ వింత పిల్లిని వెటర్నరీ డాక్టర్ రాల్ఫా ట్రాన్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. దీనికి ‘డౌ’ అని పేరు పెట్టారు. మొదట మనకి ఈ పిల్లిని చూసిన వెంటనే భయమేస్తుంది. ఆ తర్వాత దాని రూపం చూసి ఆశ్చర్యం వేస్తుంది. చివరికి అది పడుతున్న ఇబ్బందిని చూసి జాలి వేస్తుంది. ఎందుకంటే.. దీనికి రెండు తలలు ఉన్నాయి. అవి ఒకదాన్ని ఒకటి అంటుకుని ఉండటంతో మూడు కళ్లు (రెండు కళ్లు కలిసి ఒకటిగా ఏర్పడ్డాయి), రెండు నోర్లు కలిసే ఉన్నాయి.


ఈ పిల్లి క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే సమస్య వల్ల ఒకే శరీరం, రెండు తలలతో జన్మించిందత. దీనికి రెండు నోర్లు ఉండటం వల్ల ఆహారం తినేందుకు చాలా ఇబ్బంది పడుతోందని ట్రాన్ తెలిపారు. పైగా ఆ రెండు నోళ్లలోకి ఒకేసారి ఆహారాన్ని అందివ్వాల్సి వస్తోందన్నారు. దానంతట అదే తినలేకపోతున్న నేపథ్యంలో ప్రతి 5గంటలకు ఒకసారి సిరెంజ్, ట్యూబ్ సాయంతో ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సమస్య వల్ల ‘డౌ’ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో దాని కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దాని తల మధ్యలో రెండు కళ్లు కలిసి ఉన్నాయని, వాటి వల్ల అది మరింత ఇబ్బందికి గురవ్వుతోందని తెలిపారు. డౌ బరువు పెరగగానే ఆ కళ్లను తొలగిస్తామన్నారు.


డౌ చూసేందుకు ఒకే పిల్లిలా కనిపించినా.. రెండు తలలు మాత్రం వేర్వురుగా ప్రవర్తిస్తాయని ట్రాన్ తెలిపారు. ఆహారం పెట్టేప్పుడు రెండు నోర్లు ఒకేసారి తెరుస్తుందని, ఒక నోట్లో పెట్టి.. ఇంకో నోట్లో తినిపించేవరకు ఆగదని.. రెండు నోళ్లలో ఒకేసారి పెట్టాలని మారం చేస్తుందన్నారు. నవంబరు 3న డౌ‌కు నాలుగు నెలలు నిండుతాయని, ఇప్పుడిప్పుడే దానంతట అది తినేందుకు ప్రయత్నిస్తోందని, చెట్లు కూడా ఎక్కగలుగుతోందని ట్రాన్ తెలిపారు.గతంలో ఫ్రాంకెన్ లూయీ అనే ఇలాంటి రెండు ముఖాల పిల్లి ఏకంగా 15 ఏళ్లు బతికి రికార్డు సృష్టించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: