నేడు బాలల దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ షేర్‌ చేసిన ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలచివేస్తోంది. 1938లో బ్రిటీష్‌ తుపాకీ గుళ్లకు బలైపోయిన 'బాజీ రౌత్‌' అనే బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్‌ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. 


ఒడిశాలోని నీలకాంతపూర్‌కు చెందిన అమరుడు బాజీ రౌత్‌. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు.. ఓ బ్రిటీష్‌ దళం తమను పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకువెళ్లాల్సిందిగా అడిగింది. అయితే అదే దళం తమ గ్రామంలోని ఎంతో మంది అమాయకులను అత్యంత పాశవికంగా చంపిందంటూ వారి గురించి కథలు కథలుగా విన్న బాజీ.. వారు తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారు కదా ఆలోచించాడు. అందుకే తీరం దాటించే ప్రసక్తే లేదని వారితో కరాఖండిగా చెప్పాడు. దాంతో చంపేస్తామంటూ బ్రిటీష్‌ సేనలు బాజినీ భయపెట్టాయి. అయినప్పటికీ బాజీ వారికి తగ్గలేదు. కోపంపెంచుకున్న బ్రిటీష్‌ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. దాంతో అతడు కిందపడ్డాడు. 


అయినప్పటికీ బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చిచెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా... మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్‌ మాలిక్‌, ఫగూ సాహో, హృషి ప్రదాన్‌, నాటా మాలిక్‌ కూడా మృత్యువాత పడ్డారు.   


దేశ రక్షణకై బాల్యంలోనే అతడు చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సెహ్వాగ్‌... బాలల దినోత్సవం సందర్భంగా బాజీని గుర్తుచేసుకోవాల్సిందిగా పోస్టులో వివరించాడు. చిన్న వయస్సులోనే ప్రజల రక్షణకై ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్య్ర పోరాటంలో తొలి అమరుడిగా అభివర్ణించాడు. బాలల దినోత్సవంగా ఆ ధైర్యశాలికి సెల్యూట్‌ చేస్తున్నా. అత్యంత పిన్నవయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు’ సెహ్వాగ్‌ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: