ఐదు ప్రధాన కాలుష్య నగరాల్లో కర్నూలు కూడా ఒక స్థానం దక్కించుకుంది. కాలుష్యంతో దారుణమైన పరిస్థితి నెలకొంది ఈ కర్నూలులో..  కాలం చెల్లిన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా.. పట్టించుకొనే నాథుడు లేదు. దీనికితోడు చెత్త, వ్యర్థాలను బహిరంగంగానే తగలబెట్టడంతో వాటినుంచి వెలువడుతున్న పొగతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 


రాష్ట్రంలోని తొలి రెండు స్థానాలలో విశాఖ, విజయవాడ ఉండగా.. ఆ తర్వాత స్థానాలకు కర్నూలు, గుంటూరు పోటీ పడ్డాయి. ప్రధాన కూడళ్లలో వార్షిక సగటు ప్రమాణాలు ప్రమాదకర స్థాయిలో నమోదవుతుండటం నగర వాసులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరును నాన్‌ అటైన్‌మెంట్‌ నగరాలుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణ బోర్డు ఒక్కో నగరంలో కాలుష్యం ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించింది. 


నగర విస్తీర్ణాన్ని బట్టి మోనిటరింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల ద్వారా రోజువారీ, వార్షిక సగటులను బోర్డు గుర్తిస్తూ ఉంటుంది. విశాఖ పరిధిలో తొమ్మిది, విజయవాడలో 9, కర్నూలు, గుంటూరు, నెల్లూరుల్లో నాలుగు చొప్పున మోనిటరింగ్‌ పాయింట్లు ఉన్నాయి. .
 
నీటి ఎద్దడితో కటకటలాడుతోన్న కర్నూలు ఇకపై కాలుష్య కేంద్రంగా కూడా మారనుంది. గాల్లోని దుమ్ము, ధూళి కణాలను సూక్ష్మ, అతి సూక్ష్మకణాలుగా గుర్తిస్తారు. వాటిని నేషనల్‌ ఆంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌(2009) ప్రకారం పరిశీలిస్తారు. సూక్ష్మకణాలను పీఎమ్‌ 10 (10 మైక్రోమీటర్ల కంటే తక్కువ), అతిసూక్ష్మ కణాలను పీఎమ్‌ 2.5గా ఉండే ధూళి కణాలుగా పరిగణిస్తారు. పీఎమ్‌ 10 కణాలు పరిధికి మించి ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. కర్నూలులో పీఎమ్‌ 2.5 కంటే పీఎమ్‌ 10 సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే త్వరలోనే కాలుష్యంలో కర్నూలు రాష్ట్రంలో ప్రథమస్థానానికి చేరుకుంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: