పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ముగ్గురు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్ర తిప్పి కొట్టామని భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి కశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం  తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను పోలీసులు చెప్పారు. 

 

 

భారత్ లో దాడులు చేసేందుకు ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు తెచ్చినట్లు చెప్పారు. విధ్వంసం సృష్టించేందుకు బాంబులతో పాటు మార్ఫిన్‌ ఇంజెక్షన్లు, ఎల్‌ఈడీలు, బుల్లెట్‌ ఫ్రూఫ్ జాకెట్లను సైతం పాకిస్తాన్‌ నుంచి తీసుకువచ్చారన్నారు. కశ్మీర్ లోని హైవే వెంబడి సుమారు 300 కిలోమీటర్ల మేర ఉన్న భారత భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే ఉగ్రవాదులు చేసిన కుట్రను చాకచక్యంగా తిప్పి కొట్టామని పోలీసులు తెలిపారు. 

 

 

శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యాన్ లో ముగ్గురు ఉగ్రవాదులు వచ్చి పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగి ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు. తర్వాత వ్యాన్ డ్రైవర్‌ సమీన్‌ దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్‌, గ్రెనెడ్ల తో పాటు రూ.32 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్‌ సంస్థకు చెందినవారని, సముద్రంగా గుండా భారత్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. కశ్మీర్ లో ఆర్టికల్‌ 370రద్దు తర్వాత మొదటిసారిగా ముగ్గురు ఉగ్రవాదులను చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: