కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనేదానికి ఉదాహరణగా నిలిచారు ఓ సామాన్య రైతు. ఆయనకు చదువు రాదు కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రాటుదేలిపోయాడు. ఇంటర్నెట్ సహాయాన్ని జోడించి పొలంలో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేశాడు.



మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఈయన పేరు కొన్యాల సాయిలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న చిన్నరైతు కానీ తెలివితేటల్లో మాత్రం ఆయన పెద్ద రైతు. యూట్యూబ్ ను వినోదం కోసం వాడుకోవడం చాలా మందికి తెలుసు. కానీ సాయి మాత్రం తన మెదడుకు పదును పెట్టాడు. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాడు. యూటూబ్ లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడు.


ఆధునిక వ్యవసాయ పరికరాలు వాటి ధరలపై క్షుణ్నంగా తెలుసుకున్నాడు వ్యవసాయ పరికరాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా సేకరించాడు


సాగు భూముల్లో కలుపును తొలగించే యంత్రాన్ని తయారు చేశాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  తన తోటి రైతులకు బాసటగా నిలుస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం అయిందంటే చాలు రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఉంటోంది. దీంతో రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. చేలల్లో కలుపు తీయడం రైతన్నలకు తలకు మించిన భారమే. కూలీలకు డిమాండ్ పెరిగి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుండటంతో రైతులు చాలా వరకు నష్టపోతున్నారని గ్రహించిన సాయిలు యూట్యూబ్ సహాయంతో పొలంలో కలుపును తొలగించే యంత్రాన్ని తయారు చేశాడు.


టెక్నాలజీని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని సాయిలు నిరూపించాడు. గత ఆరు నెలల క్రితం పంట వేసిన సాయిలు కూలీలు దొరక్క దొరికిన కూలీలు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించమని కోరడంతో తానే స్వయంగా యూట్యూబ్ సహాయంతో పొలంలో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రాన్ని తయారు చెయ్యడానికి కావలసిన పరికరాల్ని ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. యూటూబ్ లో కొన్ని వీడియోలు చూసి, వాటి సహాయంతో ఈ యంత్రాన్ని తయారు చేయడం విశేషం.



ఈ యంత్రాన్ని తయారు చేయటానికి ఆరు నెలల కాలం పట్టిందని సాయిలు తెలిపారు. పత్తి, జొన్న మిరప పంటల్లో కలుపు తీయడానికి కనీసం పది మంది కూలీలు కావాలి. కానీ ఈ యంత్రంలో ఒక లీటర్ డీజిల్ పోస్తే చాలు ఎకరా పొలం కలుపు తీయొచ్చట. ప్రస్తుతం ఈ ఖరీఫ్ పంట సాగుకు ఈ మిషన్ ఉపయోగపడటంతో ఈ బాధ తప్పి ఐదు నుండి ఏడు వేల రూపాయల మిగిలినట్లు సాయిలు అంటున్నారు. ఇప్పుడు అందోల్ నియోజక వర్గంలోని అల్లాదుర్గం మండలంలో ఈ యంత్రం హాట్ టాపిగ్గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: