మీలో చాలామందికి పళ్ళకు, చిగుళ్ళ దగ్గర బ్రౌన్‌గా, నల్లగా కొంత పదార్థం అతుక్కొని ఉంటుంది. ఇది ఎంత తోమినా పోదు. దీనిని గార లేక టార్‌టార్‌ అంటారు. ఈ గార ఎలా ఏర్పడుతుంది. దీనివల్ల నష్టం ఏమిటి, దీన్ని ఎలా అరికట్టాలి. విషయాలు తెలుసుకుందాం. ఒ.కే. 

మనిషిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు నిరంతరం జరుగుతాయి. అంటే ఆక్సిజన్‌ పీల్చుకొని, కార్బన్‌డై ఆక్సైడును వదిలిపెడుతుంటాం. ఈ ప్రక్రియ రాత్రి సమయంలో నిద్రపోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే ఆక్సిజన్‌ పీల్చుకొంటూ, కార్బన్‌డై ఆక్సైడు ముక్కుద్వారా, కొంత నోటి ద్వారా బయటకు వస్తుంది. నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు నోట్లో ఉమ్మి (లాలాజలం)లో ఉండే కాల్షియంతో కార్బన్‌డైఆక్సైడ్‌ రసాయనిక చర్య జరిగి అంటే కాల్షియం (సున్నపు తేట)ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాలవలె తెల్లగా మార్చును అనే ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెలువడిన వాయువు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అని నిర్ధారణ అవుతుంది.

ఈ విధంగా ఏర్పడిన పాలవంటి ద్రావణం సెటిలయి, నాలుకమీద పేరుకొని తెల్లని పదార్థం ఏర్పడుతుంది. దీనికి తోడు మనం తిన్న ఆహారపు తునకలు, బ్యాక్టీరియా కలిసి నాలుక మీద ఒక తెల్లని పొర మాదిరిగా ఏర్పడుతుంది. దీన్ని మనం పాచి (ప్లేక్‌) అంటాం. సాధారణంగా పిల్లలు ఉదయాన్నే ముఖం కడుక్కోవటానికి మారాం చేస్తుంటారు. సరిగ్గా పళ్ళను శుభ్రం చేసుకోకపోవటం వలన పాచి పళ్ళమధ్య సందుల్లోను, చిగుళ్ళ కిందుగ పేరుకుపోయి ముద్దలాగా ఏర్పడుతుంది. పాచి ముద్దను 'మెటీరియా అల్బా' అంటారు.

ఇది, బ్యాక్టీరియా చర్యవలన పళ్ళకు అతుక్కుని గట్టిపడి పెంకు మాదిరిగా ఏర్పడి, రంగు కూడా పసుపు పచ్చగాను, తరువాత బ్రౌన్‌గాను మారుతుంది. దీన్నే మనం గార, ఇంగ్లీషులో టార్‌టార్‌ అంటున్నాం. పళ్ళను అతుక్కుని ఉన్న ఈ గారకు రోజురోజుకు పాచి కొంత అతుక్కొని గార పరిమాణం పెరుగుతుంది. ఈవిధంగా గార పరిమాణం పెరగటం వలన ఆహార పదార్థాలు నిలువ ఉండి బ్యాక్టీరియా వలన పళ్ళు పుచ్చిపోవటం, ఆహార పదార్థాలు కుళ్ళిపోవటం వలన నోటి దుర్వాసన ఏర్పడుతుంది. అదేవిధంగా గార పరిమాణం పెరగటం ద్వారా చిగుళ్ళు కోసుకుపోయి, గాయపడి చిగుళ్ళు వ్యాధికి కారణమవుతుంది. గారకారణంగా చిగుళ్ళను తినేసినట్లుగా అయి, పంటి మూలం బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలానికి ఈ వ్యాధి పెరిగి పళ్ళు కదలిపోవటం, పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడి, చివరకు పళ్ళు ఊడిపోవటం కూడా జరుగుతుంది.

 ఈ గారను నిర్లక్ష్యం చేసినట్లయితే నోటి దుర్వాసనతోపాటు, పళ్ళు పుఇ్చపోవటమే కాకుండా చిగుళ్ళ వ్యాధి, నోటిలో పుండ్లు (అల్సర్లు), నాలుక మీద పుండ్లు ఏర్పడి నోరంతా దుర్గంధంలో నిండి ఉంటుంది. దీని ద్వారా నోటిలో బ్యాక్టీరియాకు ఎక్కువ అనుకూల పరిస్థితులు ఏర్పడి బ్యాక్టీరియా సంఖ్య విపరీతంగా ఉత్పతి అయి మనం తీసుకునే ఆహారంతో పాటు లక్షల కొలది బ్యాక్టీరియా జీర్ణకోశంలోకి పోయి, జీర్ణకోసం నుంచి రక్తనాళంలో ప్రవేశించి, తద్వారా గుండెకు చేరి, అక్కడినుంచి శరీర అవయవాలకు చేరి, ఎక్కడ ఏ భాగంలో ఏ అవయవాలలోనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ అవయవాన్ని తినివేయటం నాశనం చేయటం జరుగుతుంది.

తద్వారా ఆ అవయవం వ్యాధికి గురవుతుంది. ఈవిధంగా శరీరంలో 70 వ్యాధులకు కారణభూత మవుతుంది. కనుక పిల్లలూ! మీరంతా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఏ ఒక్కపంటినీ అశ్రద్ధ చేయకూడదు. పాచి సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వలననే గార ఏర్పడుతుంది. ఒకవేళ గార ఏర్పడితే వెంటనే దంతవైద్యుని సంప్రదించి క్లీనింగ్‌ చేయించుకోవాలి, వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి. (డా.ఓ. నాగేశ్వరరావు, డెంటిస్ట్‌ ... 9849014562)


మరింత సమాచారం తెలుసుకోండి: