జుట్టు ఊడిపోవటానికి కారణాలు ఎన్నెన్నో. వీటిల్లో ఒత్తిడీ ఒకటి. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు కొందరికి జుట్టు ఊడిపోతుంటుంది. కొందరికి కొన్ని వారాలు, నెలల పాటూ జుట్టు రాలిపోతుంటుంది. ఆందోళనకు గురిచేసేదే అయినా ఇది తాత్కాలిక సమస్యే. ఒత్తిడి తగ్గితే జుట్టు తిరిగి మొలుస్తుంది. ఒత్తిడి మూలంగా జుట్టు రాలటమనేది సాధారణంగా మూడు రకాలుగా కనబడుతుంది. 

 

* ఒత్తిడికి లోనైనప్పుడు చాలా వెంట్రుకల కుదుళ్లు విశ్రాంతి దశలోకి వెళ్లిపోతుంటాయి. ఫలితంగా వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది. ఇలాంటి కుదుళ్లతో కూడిన వెంట్రుకలు కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా కుచ్చుకుచ్చులుగా ఊడిపోవటం మొదలవుతుంది. దీంతో తలలో అక్కడక్కడా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. 

 

* పేను కొరుకుడుకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. ఒత్తిడి మూలంగానూ ఇది రావొచ్చు. వీరిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వెంట్రుకల కుదుళ్లపై దాడిచేసి వెంట్రుకలు ఊడిపోవటానికి కారణమవుతుంది. 

 

* కొందరు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, ఒంటరితనం వంటి వాటి నుంచి బయటపడటానికి జుట్టును చేతులతో బలంగా లాగుతుంటారు. ఇదీ వెంట్రుకలు ఊడి రావటానికి దారితీస్తుంది.

 

• తగ్గించుకోవటమెలా?

ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా కీలకం. ఒత్తిడి తగ్గితే జుట్టు తిరిగి మొలుస్తుంది. ఇందుకు జీవనశైలి మార్పులు బాగా తోడ్పడతాయి. 

 

* రోజూ రాత్రిపూట 7-8 గంటల సేపు కంటి నిండా నిద్రపోవటం మంచిది. 

 

* తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం అల్పాహారం మానెయ్యరాదు. 

 

* వ్యాయామంతో ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. 

* గోరువెచ్చటి నూనెతో నెమ్మదిగా మర్దన చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు ఊడటం తగ్గొచ్చు.

 

జుట్టు రాలకుండా.....!

దువ్విన ప్రతిసారీ ఒకటో రెండో వెంట్రుకలు రాలడం సహజమే! వాస్తవానికి రోజు మొత్తంలో వంద వెంట్రుకలు ఊడినా దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతే సమానంగా కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువగా, కుచ్చులుగా ఊడిపోతూ ఉంటే మాత్రం అది కచ్చితంగా జుట్టు రాలే సమస్యే! దీన్నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పరిష్కారం లభిస్తుంది.


-    తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి.


-    టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి.


-    పెద్ద దంతాలున్న దువ్వెనతో వెంట్రుకల చిక్కు తీయాలి. సన్నని దంతాల దువ్వెనతో బలవంతంగా చిక్కు తీసే ప్రయత్నం చేసినా వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది.


-    దువ్వెనలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు.


-   తరచు తలకు నూనె రాస్తుండాలి. వారానికోసారి హాట్‌ ఆయిల్‌ ట్రీట్‌మెంట్‌ చేయాలి. ఇందుకోసం కొబ్బరి నూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.


-    ఉపయోగించే షాంపూ మార్చి చూడండి. రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు వెంట్రుకల కుదుళ్లలోని సహజ నూనెలను హరిస్తాయి. ఫలితంగా వెంట్రుకలు తేలిగ్గా ఊడిపోతాయి. కాబట్టి సున్నితమైన షాంపూలనే ఎంచుకోవాలి..


-    వెంట్రుకలను బిగదీసి కట్టే హెయిర్‌ స్టైల్స్‌ జోలికి వెళ్లకూడదు. ఇలాంటి వాటి వల్ల కుదుళ్లు దెబ్బ తింటాయి. అలాగే రబ్బర్‌ బ్యాండ్స్‌, క్లిప్స్‌ వాడకం మానేయాలి.


-  సమతులాహారం తీసుకోవాలి. శరీరంలో పోషకాలు లోపిస్తే జుట్టు రాలుతుంది. కాబట్టి మాంసకృతులతోపాటు ఐరన్‌, జింక్‌, విటమిన్‌ ఎ, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ దొరికే పోషకాహారం తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: