నాజూకుగా, అందంగా కనపడాలని ప్రతీ అమ్మాయి అనుకోవడం సహజం. ఇక అదే పెళ్లికయితే... మరింత మెరిసిపోవాలని... ఆ మధురానుభూతిని జీవిత కాలం వెంట ఉంచుకోవాలనుకుంటుంది. జీవితంలో అతిముఖ్యమైన పెళ్లి రోజు ఎలా తయారు కావాలి? మేకప్ ఎలా వేసుకోవాలి? కాంబినేషన్స్ ఏం వాడాలి? కంగారు పడిపోతుంటారు. అలా చివరి సమయంలో ఆందోళన చెందకుండా ముందస్తు జాగ్రత్తలతో పెళ్లి రోజు అందంగా కాంతులీనాలంటే ఎలా ఉండాలో బ్యూటీషన్ లు చెబుతున్న కొన్ని సలహాలు. పెళ్లికి ముందు  - పెళ్లికి రెండు మూడు వారాల ముందే మీ చర్మం, జుట్టు, చేతిగోళ్లపై శ్రద్ధ పెట్టండి. - రెండు మూడు వారాలు వరుసగా ముందే ఫేషియల్, స్క్రబ్బింగ్ వంటివి చేయించాలి. - దుమ్ము ధూళికి, ఎండకు వీలైనంత దూరంగా ఉండాలి. అసలు ఇంటినుండి బయటికి వెళ్లకుండా ఉండగలిగితే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే ఎస్‌పీఎఫ్ 20 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ అపె్లై చేసుకుని మాత్రమే వెళ్లాలి.   - ఉద్యోగాలకు వెళ్లే వాళ్లయితే వారానికోసారి బాడీ మసాజ్ చేయించుకోండి. లేదంటే స్నానానికి ముందు ఆయిల్‌తో బాడీ మసాజ్ చేసుకోవాలి. - పెళ్లికి ముందు రోజులు బాగా నిద్రపోండి. నిద్ర సరిగా లేకపోతే అలసిన కనులు మీ ముఖాన్ని కాంతివిహీనం చేస్తాయి. కళ్లకింద వలయాలు, నల్లటి చారలు ఏర్పడతాయి.  - పెళ్లికి మూడు రోజుల ముందే కనుబొమలు ట్రిమ్ చేయించుకోవాలి. పెళ్లి రోజు - పెళ్లి రోజు మేకప్ మీ జువెలరీని బట్టి ఉంటుంది. నగలు మరీ ఎక్కువగా ఉంటే లైట్ మేకప్ బాగుంటుంది. పెళ్లి, రిసెప్షన్ రాత్రి సమయాల్లో ఉంటే హెవీ మేకప్ బాగుంటుంది. - పెదాలకు వ్యాజిపూన్ అప్లై చేసి మెత్తని టూత్‌బ్రష్తో  రుద్దాలి. ముఖానికి ఫౌండేషన్ వేసేటప్పుడు అది పెదాలకు అంటకుండా జాగ్రత్తపడాలి. - లిప్‌స్టిక్, ఐషాడో మీ స్కిన్ టోన్‌కు, మీరు ధరించే డ్రెస్‌కు సెట్ అయ్యే విధంగా ఉండాలి. - ఐ షాడో కోసం సహజమైన రంగులను వాడాలి. మెరిసే రంగులను వాడకపోవడం మంచిది.   - కళ్ల కింద నల్లని చారలు, ముడతలు, మచ్చలు ఉంటే కప్పేయడానికి లైట్ షేడ్ ఉన్న ఫౌండేషన్ వాడాలి.  - ఫౌండేషన్ ముఖంతోపాటు బయటికి కనిపించే మెడ, బ్యాక్, చెవులకు కూడా వేయాలి. ముఖం వరకే వేయడం వల్ల ముఖానికి రంగేసినట్లుగా ఉంటుంది. - వాటర్ ప్రూఫ్ మస్కారాను ఉపయోగించాలి. - గ్లాసీ లిప్‌స్టిక్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. అదే షేడ్‌లో ఉన్న లిప్‌లైనర్‌ను వాడాలి. లేదంటే లిప్‌స్టిక్ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.  - పెళ్లికి ముందు అంతకుముందు వాడని కొత్త బ్రాండ్ ఉత్పత్తులతో ప్రయోగాలు చేయకండి. మీ చర్మానికి అవి సరిపడకపోతే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. - లిప్‌స్టిక్, పౌడర్, మస్కారా, హెయిర్‌పిన్స్, సేఫ్టీ పిన్స్, లిప్‌గ్లాస్, పేపర్ టిష్యూస్ అవసరం పడుతూ ఉంటాయి. అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: