ఒత్తిడి నివారణకు..
ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవుతాయి. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే సరిపోతుంది. ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు. 


వజ్రాసనం : 
రెండు కాళ్లూ ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఒక్కోకాలు వెనక్కి తీసుకెళ్లి జఘన భాగం కిందుగా ఉంచాలి. రెండు పాదాల పెద్ద వేళ్లు ఒకదాని మీదుగా ఒకటి వచ్చేట్లు ఉంచి పాదాల మధ్యన ఉన్న ఖాళీలో కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. ఊపిరి మామూలుగా పీల్చుకోవాలి. చేతులు కాళ్లమీద ఉంచాలి. 


శుప్త వజ్రాసనం :
వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను కొంచెం దూరంగా ఉంచాలి. రెండు పాదాల వేళ్లు దగ్గరగా వచ్చి మడమలు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. మోచేతులు శరీరానికి పక్కగా తెచ్చి నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి తీసుకెళ్లి తలను నేలకు ఆన్చాలి. చేతులు రెండూ నెమ్మదిగా కాళ్లమీద పెట్టాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా చేతి ఆసరాతో యథాస్థితికి రావాలి. 
ఉపయోగాలు :


- ఊపిరితిత్తులు, పక్కటెములకు మంచి శక్తినిస్తుంది. 
- ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది. 
- కాలి కండరాలను బలోపేతం చేస్తుంది. 
- థైరాయిడ్‌గ్రంథిని ఉత్తేజం చేస్తుంది. 


పరిపూర్ణశుప్త వజ్రాసనం :
వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా పాదాలు రెండూ రెండు ఎడంగా జరిపి, నడుం భాగాన్ని పాదాల మధ్యన నేలకు ఆనేటట్లుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోచేతులూ పక్కగా ఆన్చి శరీరాన్ని నెమ్మదిగా వెనుకగా భూమి మీదకు ఆన్చాలి. మొత్తం శరీరం నేలకు ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులనూ ఒకదానితో ఒకటి పెనవేసి తల మీదగా నిటారుగా భూమిమీద ఉంచాలి. ఇదే స్థితిలో ఊపిరి మామూలుగా పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి మెల్లగా యథాస్థితికి రావాలి. 


ఉపయోగాలు :
- రిబ్‌కేజ్‌ను ఓపెన్ చేస్తుంది కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది. 
- ఆస్తమా ఉన్నవారికి మంచిది. 
- థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఉపయోగకరం. 

జాగ్రత్తలు :
- మోకాలి నొప్పులు ఉన్నవారు కొద్దిసెకన్లపాటు మాత్రమే చేయవచ్చు. 
- నొప్పి బాగా ఉంటే చేయకూడదు. 
- కాళ్ల కింద పల్చని దిండు ఉంచవచ్చు. 
- సయాటికా ఉన్నవారు చేయకూడదు. 
- స్లిప్‌డిస్క్, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
గమనిక : శుప్తవవూజాసనం చేసిన తరువాత పశ్చిమోత్తాసనం చేయాలి (నెమ్మదిగా). ఈ ఆసనాన్ని వేయలేకపోతే నడుము దగ్గర నుంచి తలవరకు పొడవుగా దిండు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 
-యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి

మరింత సమాచారం తెలుసుకోండి: