ప్ర‌తిప‌క్షాల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత ప్ర‌ధాని పార్ల‌మెంట్ ప‌క్ష నేత‌ల‌తో తొలిసారి స‌మావేశం నిర్వ‌హించారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, లాక్‌డౌన్ పొడిగింపుపై చ‌ర్చించారు. అయితే.. లాక్‌డౌన్ పొడిగించాలంటూ ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌ధాని మోడీని కోరారు. ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కొన‌సాగించాల్సిందేన‌ని, క‌రోనా క‌ట్ట‌డికి మన‌ముందున్న ఏకైనా మార్గం ఇదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. క‌రోనా వైర‌స్ మ‌రింత‌గా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. కేసీఆర్ దారిలోనే మ‌రికొంద‌రు ముఖ్య‌మంత్రులు కూడా న‌డిచారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ త‌దిత‌ర రాష్ట్రాల సీఎంలు కూడా లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని సూచించారు. మ‌రోవైపు కేంద్ర మంత్రుల బృందం కూడా లాక్‌డౌన్ కొనసాగించాలంటూ సిఫార‌సు చేసింది. 

 

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంట్ ప‌క్ష నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఏప్రిల్ 14 త‌ర్వాత‌ లాక్‌డౌన్ పొడిగింపు దిశ‌గా కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. లాక్‌డౌన్ పెంచ‌డంపై ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా నిత్యావ‌స‌రాల నిల్వ‌లు ఉంచుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వేళ కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఎత్తేసినా అనేక రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం వారివారి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కొన‌సాగించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇలా ఎన్ని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ప్ర‌ధాని మోడీ ఏం నిర్ణ‌యం తీసుకుంటున్నార‌న్న‌దానిపై అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: