లాక్‌డౌన్‌పై ఉత్కంఠ కొన‌సాగుతోంది. రోజురోజుకూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతున్న నేప‌థ్యంలో ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత ఎత్తేయాలా..?  లేక పొడిగించాలా..? అన్న అంశంపై ఇంకా కేంద్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. అయితే.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌ల‌తో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లాక్‌డౌన్‌, క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. అయితే.. ఇందులో ప్ర‌ధానంగా లాక్‌డౌన్‌పైనే చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌లో త‌గ్గుముఖం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏం చేయాల‌న్న‌దానిపై ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోయారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొన‌సాగించ‌డ‌మే మంచి మార్గ‌మ‌ని పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌లు మోడీకి సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల‌ని సూచించారు. 

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయితే.. ఒక అడుగు ముందుకేసి.. లాక్‌డౌన్‌ను కొనసాగించ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే.. ఈనెల 11న మ‌రోసారి అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆరోజు ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించి, వారిచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. దాదాపుగా దేశ‌వ్యాప్తంగా వ్యాపించిన క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టాలంటే మ‌న చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్ ఒక్క‌టేన‌ని, దానిని మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌లువురు ముఖ్య‌మంత్రులు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: