క‌రోనా.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఈ వైర‌స్ పేరు వింటేనే ప్ర‌పంచ ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఇక కొంద‌రు అయితే..క‌రోనా భ‌యంతో ఆత్మ‌హ‌త్య‌కు కూడా పాల్ప‌డుతున్నారు. కానీ.. మ‌రికొంద‌రు మాత్రం క‌రోనాకు ఎందుకు భ‌య‌ప‌డాలంటూ తిర‌గ‌బ‌డుతున్నారు. వైర‌స్‌తో పోరాడాల‌ని సూచిస్తున్నారు. మ‌న‌లో మ‌నోధైర్యం ఉంటే..క‌రోనా మ‌న‌ల్ని ఏమీ చేయలేద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల ఇట‌లీలో 104ఏళ్ల బామ్మ క‌రోనాను జ‌యించి రెండు విష‌యాలు చెప్పింది. ధైర్యం, దైవ‌భ‌క్తే త‌న‌ను కాపాడాయ‌ని చెప్పుకొచ్చారు. తాజాగా.. క‌ర్నాట‌క రాష్ట్రానికి చెందిన దావణగెరె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జి.ఎం. సిద్దేశ్వర కుమార్తె అశ్విని కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. తాను క‌రోనాను ఎలా జ‌యించానో చెబుతోంది.  సౌత్ ఆఫ్రికాలోని గయానాలో అశ్విని ఉంటున్నారు. అయితే గయానాలో ఎన్నికల లొల్లి ఎక్కువ కావ‌డంతో అశ్విని కుటుంబ సభ్యులతో క‌లిసి మార్చి 20వ తేదీన‌ భారత్ వచ్చేశారు. ఈ స‌మ‌యంలో ప్రపంచం మొత్తం కరోనాతో వ‌ణికిపోతోంది. 

 

ఇక్క‌డ‌ అశ్విని, ఆమె పిల్లలకు వైద్యులు రెండు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు పాజిటివ్, తన పిల్లలకు నెగటివ్ వచ్చిందని అశ్విని చెప్పారు. వెంట‌నే అధికారులు త‌న‌ను అంబులెన్స్ లో ఎస్ఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచార‌ని అశ్విని అన్నారు. తాను 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో వైద్యుల ఇచ్చిన మందులు ఉపయోగించానని,  ఎలాంటి మాన‌సిక ఆందోళ‌న‌కు గురికాకుండా ధైర్యంగా తాను పోరాటం చేసి కరోనాను ఎదుర్కొన్నానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నానని ఆమె అంటున్నారు. త‌న‌కు కుటుంబ స‌భ్యులు ఎంతో అండ‌గా నిలిచార‌ని చెప్పారు. వార్డులో ప్ర‌తీరోజు యోగా చేయ‌డంతో పాటు దేవుడికి ప్రార్థించాన‌ని అశ్విని వివ‌రించారు. అలా చేయ‌డం వ‌ల్లే తాను క‌రోనాను జ‌యించాన‌ని పేర్కొన్నారు. క‌రోనా పెద్ద వ్యాధేమీ కాద‌ని, మ‌నం మాన‌సికంగా ధైర్యంగా ఉండాల‌ని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: