క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7న‌ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంద‌ర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ #ThanksHealthHeros హ్యాష్‌ట్యాగ్‌ పేరిట వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రాణాల‌కు తెగించి వైద్యులు క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స చేస్తుండ‌డంతో వారికి సంఘీభావ సంకేతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. అయితే.. ఈ చాలెంజ్‌కు స్పందించిన ఉపాసన కూడా వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశం ట్విటర్‌లో షేర్‌ చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ, టెడ్రోస్‌, తెలంగాణ సీఎంఓను ఆమె ట్యాగ్‌ చేశారు. ఇందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్ స్పందించారు. ఉపాసన ప్రయత్నాన్ని ఆయ‌న‌ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. *మా #ThanksHealthHeros క్యాంపెయిన్‌లో భాగస్వామ్యమైనందుకు, భారత్‌ నుంచి ఈ సవాలు స్వీకరించినందుకు ఉపాసన కొణిదెలకు ధన్యవాదాలు. అలాగే.. కోవిడ్‌-19 కట్టడికై పోరాడుతూ.. మనందరినీ ఆరోగ్యంగా, భద్రంగా ఉంచుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రుణపడి ఉంటా. అంతా కలిసికట్టుగా ఉందాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

 

అయితే..  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏప్రిల్‌ 7న ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం నిర్వ‌హిస్తోంది. 2020 ఏడాదికి గానూ ‘అందరికీ ఆరోగ్యం’ నినాదాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం ప్రాణాలను పణంగా పెట్టి క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి మానవాళిని రక్షిస్తున్న వైద్య సిబ్బంది పట్ల ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతా భావం చాటుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా.. అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన హెల్త్‌కేర్‌ విభాగంలో కీల‌క బాధ్య‌త‌లుచేప‌డుతున్న ఉపాసన సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. అంతర్జాతీయ సదస్సులకు ఆమె హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో గతేడాది మహాత్మా గాంధీ అవార్డును  కూడా ఆమె సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: