భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇత‌ర అనారోగ్య కార‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన వారికి కూడా క‌రోనా సోకుతోంది. కేన్సరుతో బాధపడుతూ చికిత్స కోసం ద‌వాఖాన‌లో చేరిన ముగ్గురు రోగులకు కరోనా వైరస్ సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆస్ప‌త్రిలో చోటుచేసుకుంది. ఆస్ప‌త్రిలో చేరిన కేన్సర్ రోగులకు క‌రోనా ఎందుకు సోకుతుంద‌ని అనుకుంటున్నారా..?  ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారానే క్యాన్స‌ర్ రోగుల‌కు క‌రోనా సోకి ఉంటుంద‌ని వైద్యులు భావిస్తున్నారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు కరోనా సోకిన కేన్సర్ రోగులను రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటరుకు తరలించారు. అనంతరం ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆస్ప‌త్రిని శానిటైజ్ చేయించి తాత్కాలికంగా మూసివేశారు.

 

ఆస్ప‌త్రిలో ఉన్న మరో 19 మంది కేన్సర్ రోగులను ఇతర ద‌వాఖాన‌ల‌కు తరలించారు.  ఢిల్లీలోని 25 హాట్ స్పాట్లలో కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటంతో అందరూ మాస్క్ లు ధరించాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న క్ర‌మంలో వైద్య సిబ్బంది కూడా క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌లువురు వైద్యులకు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఇక ముంబైలోని హోక్‌హార్ట్ ఆస్ప‌త్రిలో ఏకంగా 26మంది న‌ర్సులు, ముగ్గురు డాక్ట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. అలాగే, కేర‌ళ‌లో కూడా ఓ న‌ర్సుకు క‌రోనా సోకింది. మ‌ధ్య ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్ దంప‌తుల‌తోపాటు మ‌రో న‌లుగురికి క‌రోనా సోకింది. ఇక ఇట‌లీలో సుమారు 100మందికిపైగా క‌రోనాకు బ‌లి అయ్యార‌ని అక్క‌డ వైద్య సంఘాలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర అనారోగ్య కార‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరుతున్న‌రోగులు కూడా తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: