క‌రోనా కేసులు ఎక్కువ సంఖ్య‌లో వెలుగు చూస్తున్న ప్రాంతాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం హాట్ స్పాట్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 130 ప్రాంతాల‌ను గుర్తించి, మూడు వేల మంది వైద్య ఆరోగ్య‌శాఖ సిబ్బందిని అక్క‌డ మోహ‌రించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

 

హైద‌రాబాద్ కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు ఆయా ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటినీ సర్వే చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతుండగా, కరోనా అనుమానితులను ద‌వాఖాన‌ల‌కు తరలిస్తున్నారు.  

 

కంటైన్మెంట్‌ ప్రాంతంగా గుర్తించబడిన మల్లేపల్లిలో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌  పర్యటించారు. కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించబడ్డ బడీ మసీదు, దాని పరిసరాలలో ఆయన పర్యటించి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను, సీసీ కెమెరాలను పరిశీలించారు.  రాకపోకలు నిలిపివేసి పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: