ఓవైపు భార‌త్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో మంకీ ఫీవ‌ర్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ది. భార‌త‌ దేశంలోనూ క‌రోనా కేసుల సంఖ్య శుక్ర‌వారం ఉద‌యం నాటికి 6 వేలు దాటింది. మ‌ర‌ణాల సంఖ్య రెండువంద‌ల‌కుపైగా ఉంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ క‌రోనా వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ రాష్ట్రంపై మ‌రో పిడుగు పడింది. అక్క‌డ మ‌రో వ్యాధి క‌ల‌కలం రేపుతోంది. శివ‌మొగ్గ జిల్లాలో మంకీ ఫీవ‌ర్ క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్ప‌టికే 139 మందికి మంకీ జ్వరాలు రాగా.. వారిలో ముగ్గురు మృతిచెందార‌ని శివ‌మొగ్గ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ ప్ర‌క‌టించారు.  మ‌రో 130 మందికి చికిత్స చేయడంతో వారు కోలుకున్న‌ట్లు తెలిపారు. 

 

గ‌త సంవ‌త్స‌రం కూడా శివమొగ్గ జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభించాయి. దాదాపు 400 మందికి మంకీ ఫీవ‌ర్ రాగా, వారిలో 23 మంది మరణించారు. ఈ ఏడాది కూడా అక్క‌డ మంకీ జ్వరాలు ప్రబలడంతో జిల్లా ప్రజలు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. శివమొగ్గ అడవుల్లోని కోతుల ద్వారా ఈ మంకీ ఫీవ‌ర్ వ‌స్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆ జిల్లాలో ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారుతోంది. క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల్లో జ్వ‌రం కూడా ఉండ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని అటు వైద్య వ‌ర్గాలు, ఇటు ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగ ఉండాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, క‌రోనా, మంకీ ఫీవ‌ర్ క‌ట్ట‌డికి అన్ని చర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: