అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ విధ్వంసం కొన‌సాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేల‌ల్లో పెరుగుతోంది. మ‌ర‌ణాలు కూడా వేల సంఖ్య‌లోనే ఉంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో  18,586 మరణాలు సంభ‌వించాయి. గత 24 గంటల్లో 2,108 మరణాలు సంభ‌వించాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన లెక్క‌ల ప్ర‌కారం.. ఒకే రోజులో రెండు వేలకు పైగా కరోనావైరస్ మర‌ణాలు సంభ‌వించిన దేశంగా అమెరికా నిలిచింది. ఈ గ‌ణాంకాలను చూస్తేనే తెలుస్తోంది.. అమెరికాలో ఎంత‌టి ద‌య‌నీయ ప‌రిస్థితులు ఉన్నాయో..! ఇక పాజిటివ్ కేసుల సంఖ్య కూడా సుమారు ఐదుల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ దారుణమైన ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. ఈ మ‌ర‌ణాల్లో సుమారు 15మంది భార‌తీయులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

న్యూయార్క్‌, న్యూజెర్సీ త‌దిత‌ర ప్రాంతాల్లోనే అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అమెరికాలో సంభ‌వించిన మ‌ర‌ణాల్లో దాదాపుగా సగం ఒక్క న్యూయార్క్‌, న్యూజెర్సీలో ఉంటాయ‌ని అంటున్నారు. ఇక బాధితులు,  మృత‌దేహాల‌తో ఆస్ప‌త్రులు నిండిపోతున్నాయ‌ని అంటున్నారు. గ‌త 24 గంట‌ల్లోనే 35, 098 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే.. అమెరికాలోక‌రోనాతో మ‌ర‌ణించే వారి సంఖ్య ల‌క్ష లోపే ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆదేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు, క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ట్రంప్ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటలీలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 18,849కు చేరుకుంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించింది ఈ దేశంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత అమెరికా ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: