తెలంగాణ‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి విద్యాసంవత్సరం పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయం ఛాన్సాలర్‌, రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌదరరాజన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యూనివర్సిటీ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి సిలబస్‌ను పూర్తి చేసి విద్యాసంవత్సరం పూర్తి చేయాలని గవర్నర్ త‌మిళ‌సై ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ సీ. గోపాల్‌రెడ్డి విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ తీసుకుంటున్న చర్యల గురించి గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్స్‌, డీన్లతో రిజిష్ర్టార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. పవర్‌ పాయింట్ పాఠ్యాంశాలు, వీడియో పాఠాలు, వెబ్‌సైట్‌ లింకుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చేరేవిధంగా చూడాలని ఆదేశించారు. 

 

యూనివర్సిటీకి చెందిన కాలేజీలు, అనుబంధ ప్రైవేట్‌ కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆయ‌న‌ తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌లు, అధ్యాపకులు వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులతో అనుసంధానం కావాలని ఆయ‌న ఆదేశించారు. విద్యార్థుల డౌట్లు ఎప్పటికప్పుడు సరిదిద్దాలని ఆయ‌న‌ ఆదేశించారు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఇప్పటికే విద్యార్థులకు ప్రసారం కోసం వెబ్‌సైట్‌ లింక్‌ల జాబితాను కాలేజీలు ప్రిన్సిపాల్స్‌కు పంపించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు డిజిట‌ల్ త‌ర‌గ‌తుల‌ను ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ నెల 23వ‌ర‌కు డిజిట‌ల్ త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి చానెల్‌లో ఉద‌యం 10 నుంచి 11గంట‌ల వ‌ర‌కు,  సాయంత్రం 4గంట‌ల నుంచి 5వ‌ర‌కు సాగుతాయ‌ని తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: