ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఈ నిర్ణ‌యం త‌ప్ప‌డం లేద‌ని సీఎం తెలిపారు. అయితే.. లాక్‌డౌన్ నుంచి ఒక్క వ్య‌వ‌సాయ రంగానికి, దాని అనుబంధ‌రంగాల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎందుకంటే.. వ్య‌వ‌సాయ రంగానికి అనుమ‌తి ఇవ్వ‌కుంటే మ‌న‌కు బువ్వ దొర‌క‌ద‌ని, అదే స‌మ‌యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కూడా లాక్‌డౌన్‌లో అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త్ ప్ర‌జ‌ల‌ను సాదే శ‌క్తిసామార్థ్యాలు ఎవ‌రికీ లేద‌ని, అందుకే రైతాంగానికి అవ‌కాశం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం 3గంట‌ల నుంచి సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న నిర్వహిస్తున్న ఈ స‌మావేశం ఐదు గంట‌ల‌కుపైగా  జ‌రిగింది.  లాక్‌డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌పై ప్ర‌ధానంగా ఈ స‌మావేశంలో చర్చించారు.  ఈ సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీఎం వివ‌రాలు వెల్ల‌డించారు. 

 

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల వివ‌రాల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.  ఇత‌ర దేశాల‌నుంచి వ‌చ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. పాత‌వికొత్త‌వి క‌లుపుకుని శ‌నివారం రాత్రి వ‌ర‌కు 503 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. ఇందులో 14మంది చ‌నిపోయారని, 96 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు 393 ఉన్నాయని తెలిపారు. మ‌ర్క‌జ్‌కు వెళ్లిన వ‌చ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామ‌ని 1640మంది ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నార‌ని సీఎం కేసీఆర్ ముఖ్య‌మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయ‌ని, ఇందులో జీహెచ్ఎంసీ ప‌రిధిలో  123,  ఇత‌ర ప్రాంతాల్లో 120 ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ లాక్‌డౌన్ కు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: