చైనాలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం రేపుతోందా..?  క‌రోనా వైర‌స్ రెండో ద‌శ మొద‌ల‌వుతోందా..? ఒక్క‌సారిగా ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే చెబుతోందా..? అంటే  తాజా ప‌రిస్థితులు మాత్రం ఔననే అంటున్నాయి. ఇటీవ‌ల వ‌ర‌కు క‌రోనాపై చైనా విజ‌యం సాధించింద‌ని, ఇఅద్భుత విజ‌య‌మ‌ని ప్రపంచం అనుకుంటున్న వేళ‌.. ఒక్క‌సారిగా పాజిటివ్ కేసుల సంఖ్యఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. చైనాలో ఒక్క‌రోజే 99 కొత్త కరోనావైరస్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇటీవ‌లి కాలంలో ఒక్క‌రోజే న‌మోదు అయిన కేసుల్లో ఇదే అత్య‌ధికం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో చైనాలో మొత్తం రోగుల సంఖ్య 82,052 కు చేరుకుంద‌ని వైద్యాధికార‌లు శ‌నివారం వెల్ల‌డించారు. దీంతో చైనాలో రెండో ద‌శ క‌రోనా ప్రారంభమైంద‌ని ప‌లువురు అంటున్నారు. 

 

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం శనివారం నాటికి మొత్తం విదేశాల నుంచి వ‌చ్చిన‌ 1,280మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇందులో 481 మంది కోలుకున్న తర్వాత ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 799 మంది చికిత్స పొందుతుండ‌గా.. ఇందులో 36 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్నారు. అయితే..ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. శ‌నివారం కొత్త‌గాన‌మోదు అయిన 99 కేసుల‌లో 97 విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తులవేన‌ని చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్ పుట్టినిల్లు అయిన వుహాన్ న‌గ‌రంలో మ‌ళ్లీ కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల ఇక్క‌డ లాక్‌డౌన్ ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు హాయిగా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వివిధ దేశాలలో ఉన్న‌ వందలాది మంది చైనా పౌరులు చైనా ప్రభుత్వ సహాయంతో స్వదేశానికి తిరిగి రావడంతో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: