క‌రోనా వైర‌స్‌పై పోరుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది ఎంఎల్‌.శర్మ దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దురుద్దేశంతో కూడుకున్నదని, అందుకే దీన్ని తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా కేంద్ర‌ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున నిధులు స‌మ‌కూరుతున్నాయి. అయితే..రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ విరాళాల‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి(సీఎంఆర్ఎఫ్‌)లో జ‌మ చేస్తున్నాయి.

 

కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఈ  విరాళాల‌ను ప్రైమ్ మినిస్ట‌ర్ నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్‌(పీఎంఎన్ఆర్ఎఫ్‌)కు  కేటాయించ‌కుండా ప్ర‌త్యేకంగా ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పిఎం-కేర్స్)  నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో విరాళాల‌ను జ‌మ చేస్తోంది. అయితే.. పీఎంఎన్ఆర్ఎఫ్ ఉండ‌గా.. పీఎం-కేర్స్  ఏర్పాటు చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి మోడీకి లేఖ‌కూడా రాశారు. మ‌రోవైపు ప్ర‌ధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పిఎం-కేర్స్) నిధిని ధర్మకర్తలు నియమించిన స్వతంత్ర నిపుణులు ఆడిట్ చేయనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: