ఏపీ మాజీ ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సంత‌కం ఫోర్జ‌రీ జ‌రిగిందా ?  కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి ఆయ‌న రాసిన లేఖ‌లో ఉన్న సంత‌కానికి, ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ సంద‌ర్భంగా జారీ చేసిన సంత‌కానికి మ‌ధ్య పొంత‌న లేదా ? ఈ విష‌యంపై వైసీపీ సీనియ‌ర్ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప‌క్కా ఆధారాలు సేక‌రించారా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌న్న‌ట్టుగానే ఉన్నాయి. కొద్ది రోజులుగా నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య న‌డుస్తోన్న మాట‌ల యుద్ధం తాజాగా కొత్త మ‌లుపు తిరిగింది. 

 

నిమ్మ‌గ‌డ్డ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉండగానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న స‌డెన్‌గా వైసీపీ ఎక్కువ ఏక‌గ్రీవాలు గెలుచుకుని స్థానిక ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న అంచ‌నాలు ఉండ‌గానే క‌రోనా కార‌ణంతో స్థానిక ఎన్నిక‌ల‌ను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేశారు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఆయ‌న్ను త‌ప్పించి త‌మిళ‌నాడుకు చెందిన క‌న‌గ‌రాజ్‌ను కొత్త ఎన్నిక‌ల అధికారిగా నియ‌మించారు. 

 

నిమ్మ‌గ‌డ్డ హోం శాఖ కార్య‌ద‌ర్శికి రాసిన లేఖ‌లో ఉన్న సంత‌కం ఫోర్జ‌రీ జ‌రిగింద‌ని విజ‌యసాయి సందేహం వ్య‌క్తం చేశారు. ఈ లేఖ టీడీపీ ఆఫీస్ నుంచే త‌యారైంద‌ని కూడా ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, వ‌ర్ల రామ‌య్య‌, టీడీ జనార్థ‌న్ ముగ్గురు క‌లిసి మంగ‌ళ‌గిరిలో ఉన్న టీడీపీ కార్యాల‌యం నుంచే ఈ లేఖ‌ను కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి మెయిల్ చేశార‌ని... ఇందుకు త‌న ద‌గ్గర ప‌క్కా ఆధారాలు ఉన్నాయని కూడా విజ‌య‌సాయి రెడ్డి డీజీపీకి రాసిన లేఖ‌లో ఆరోపించారు. 

 


ఐపీ ఆధారంగా ఈ లేఖ ఎక్క‌డ నుంచి వెళ్లిందో గుర్తించి... నివేదిక త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌సాయి కోరారు. విజ‌య‌సాయి త‌న ద‌గ్గ‌ర ఈ లేఖ‌, నిమ్మ‌గ‌డ్డ సంత‌కం ఫోర్జ‌రీ అని ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని చెప్ప‌డంతో నిమ్మ‌గ‌డ్డ, అటు టీడీపీ వాళ్లు ఇరుక్కుపోతారా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: