టీవీలో ఇచ్చిన త‌ప్పుడు క‌థ‌నం వ‌ల్లే ముంబైలో బాంద్రా ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.  రైళ్లు పునఃప్రారంభమ‌వుతున్నాయ‌ని తప్పుడు వార్తా క‌థ‌నం ప్ర‌సారం చేసి,  వలస కార్మికులు ముంబై సబర్బన్‌ బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు కారణమైన టీవీ జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు జన్‌ సాధారణ్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు జ‌ర్న‌లిస్టు రాహుల్‌ కులకర్ణి వార్తా కథనం ఇచ్చారు. అయితే.. ఏప్రిల్ 14వ తేదీ ఉద‌యం 10గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే.

 

అయితే.. అదే రోజు సాయంత్రం 4గంట‌ల‌కు ఒక్క‌సారిగా వేలాదిమంది వ‌ల‌స కార్మికులు బాంద్రా రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్నారు. త‌మ‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. దీంతో పోలీసులు కూడా లాఠీచార్జి చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఓవైపు సామాజిక దూరం పాటించ‌కుండా వేలాదిమంది గుమిగూడ‌డంతో ఒక్క‌సారిగా అధికార‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. దీనిపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ విచార‌ణ‌లో జ‌ర్న‌లిస్టు ఇచ్చిన త‌ప్పుడు క‌థ‌నం వ‌ల్లే బాంద్రా ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తేల‌డంతో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: