ప్రాణాల‌కు తెగించి క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న వైద్య‌సిబ్బంది కూడా క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. తాజాగా.. తెలంగాణ‌లోని నిమ్స్ స్టాఫ్ న‌ర్సు కూడా క‌రోనాబారిన ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో వైద్య‌వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. వెంట‌నే ఆ స్టాఫ్‌న‌ర్సును హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక నిమ్స్ హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌ను క్వారంటైన్‌లో ఉంచి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే స‌రిస్థితి క‌నిపిస్తోంది. ఢిల్లీలో, మ‌హారాష్ట్ర‌లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోకూడా వైద్య సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇటీవ‌ల ముంబైలోని హోక్‌హార్ట్ ఆస్ప‌త్రిలో ఏకంగా 26 మంది న‌ర్సులు, ముగ్గురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా సోకింది. దీంతో ఆస్ప‌త్రి సిబ్బందినంతా క్వారంటైన్ చేశారు.

 

ఢిల్లీలోని క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో  కూడా ముగ్గురు డాక్ట‌ర్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. డాక్ట‌ర్ల నుంచి కూడా క్యాన్స‌ర్ రోగుల‌కు క‌రోనా సోకింది. ఈ ప‌రిణామాలు వైద్య‌వ‌ర్గాల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఏపీలోని క‌ర్నూలులో ఓ డాక్ట‌ర్ క‌రోనాతో మృతి చెందారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత నిర్ధార‌ణ‌లు ప‌రీక్ష‌లు రాగా.. అందులో క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇక వైద్య‌సిబ్బంది ర‌క్ష‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: