తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ ఉధ్రుతి పెరుగుతోంది. గ‌త ప‌ది రోజులుగా రాష్ట్రంలో స‌గ‌టున 50కి పైగానే కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈనెల మొద‌టి వారంలో 107 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, ఆ సంఖ్య శ‌నివారం నాటికి 809కి చేరింది. రాష్ట్రంలో కొత్త‌గా 43 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, వాటిలో గ్రేటర్ హైద‌రాబాద్ పరిధిలోనే 31 కేసులు ఉన్నాయి. న‌గ‌రంలో కంటైన్మెంట్ జోన్ల ను పెంచుతూ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నా... కేసుల న‌మోదు ఆగ‌డంలేదు. ఇంత‌టి తీవ్ర‌మైన ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తే... పేనం మీద నుంచి పొయిల ప‌డ్డ‌ట్లే అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఈనేప‌థ్యంలోనే మ‌రికాసేప‌ట్లో తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. 

 

 

లాక్‌డౌన్ స‌డ‌లింపుపై ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివిధ పార్టీల నేత‌లు, మేధావుల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. వారంతా కూడా లాక్‌డౌన్ ను మే 3వ‌ర‌కు కొన‌సాగించాల‌ని,  ఏ మాత్రం స‌డ‌లింపులు ఇచ్చినా ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుంద‌ని సీఎంకు సూచించారు. ఈక్ర‌మంలోనే లాక్‌డౌన్ మే నెల 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించిన‌ప్ప‌టికీ, ఈనెల 20 నుంచి కొన్ని సడ‌లింపుల‌ను కేంద్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాలా... రాష్ట్రం లో ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా మేనెల 3 వ తేదీ వ‌ర‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై కేబినెట్ చ‌ర్చించ‌నుంది. అయితే మంత్రి వ‌ర్గ స‌మావేశం త‌ర్వాత సీఎం కేసీఆర్  మీడియాతో మాట్లాడ‌నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: