దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటివరకు మహారాష్ట్రలో 5,649 కరోనా కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 18 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రజలు కరోనా పేరు వింటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే సమయంలో ఎంఎన్ఎస్ నేత రాజ్ థాకరే లిక్కర్ షాపులు తెరవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
రాజ్ థాకరే రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని... ఆ ఆదాయం కరోనా నియంత్రణ కోసం ఉపయోగించవచ్చని అన్నారు. ఈ మేరకు మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నెల 18వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతోందని... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నారని.. లాక్ డౌన్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బ తింటుందని చెప్పారు. 
 
మద్యం దుకాణాలు తెరవడం వల్ల రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందని... ఎవరికీ ఎటువంటి హాని జరగదని అన్నారు. మద్యం దుకాణాల ద్వారా నెలకు రాష్ట్రానికి 1250 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని రాష్ట్ర ఆదాయం పెరగడానికి మద్యం దుకాణాలు తెరవడమే సరైన మార్గమని సూచించారు. ఈ లేఖ పట్ల సీఎం ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: