త‌మిళ‌నాడులో  కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా కొన్నిరోజులుగా చెన్నైలోనే అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కొత్తగా 72 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, అందులో 52 కేసులు చెన్నైలోనే నమోదయ్యాయి. అయితే ఒకేరోజు 114 మంది డిశ్చార్జి కావడం ఆశాజనకమైన విషయం. మొత్తంగా తమిళనాడులో ఇప్పటి వరకు 1,755 పాజిటివ్‌ కేసులు నమోదుగా, 866 మంది కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో రెండు మరణాలు సంభవించడంతో, కరోనా మృతుల సంఖ్య 22కి పెరిగింది. 

 

అయితే కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న చెన్నై, కోయంబత్తూరు, మదురై నగరాల్లో ఈనెల 26 నుంచి 29 వరకూ లాక్‌డౌన్‌ సంపూర్ణంగా, మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి  పళనిస్వామి ప్రకటించారు. ఆ నాలుగు రోజులు ఎలాంటి సడలింపులు ఉండవు. అంతేకాదు, ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు రహదారులపై జనసంచారం లేకుండా కఠిన చర్యలు చేపడతామని సీఎం హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులలోనే వాహన సంచారానికి పోలీసులు అనుమతిస్తారని, బైకులు, స్కూటర్లు, ఆటోల సంచారాన్ని పూర్తిగా నిషేధిస్తారని ఆయన పేర్కొన్నారు.  26 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 9 గంటల వరకూ నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేస్తారని పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: