ఫేస్‌బుక్‌లో పరిచయమైన సైబర్ మోస‌గాడి‌ మాటలు నమ్మిన ఓ మహిళ నిండామునిగింది. ప్రమాదవశాత్తు కొడుకు చనిపోగా అందిన రూ.10 లక్షలను పోగొట్టుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఒక మహిళకు ఫేస్‌బుక్‌లో జమ్మి జే పేరుతో ఒకడు పరిచయమయ్యాడు. తాను లండన్‌లో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు. ఈక్ర‌మంలో ఇద్ద‌రూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. జనవరి నెలలో ఇండియాకు వస్తున్నానని, నువ్వు ఊహించనట్లుగా పెద్ద మొత్తంలో బ్రిటన్‌ పౌండ్లు, ఆభరణాలు బహుమతిగా తెస్తున్నానంటూ న‌మ్మించాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్‌ అధికారులు పట్టుకొన్నారని, బ్రిటన్‌ పౌండ్లు, ఆభరణాలు విడిపించేందుకు రూ.1.85 లక్షలు పన్ను చెల్లించాలంటున్నారని సదరు మహిళకు ఫోన్‌లో చెప్పాడు. వెంట‌నే ఆమె.. ఆయన చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేసింది. ఆ తరువాత ఆ మోస‌గాడు మ‌ళ్లీ ఫోన్ చేశాడు.

 

తన వస్తువులను సీజ్‌ చేసిన అధికారులు ఇప్పడే తనను వదిలిపెట్టడంతో లండన్‌ వెళ్లిపోతున్నానంటూ నమ్మించాడు. ఇక అనంతరం ఏప్రిల్‌ నెలలో సదరు మహిళకు మళ్లీ ఫోన్ చేశాడు. జనవరిలో నీవు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ చెబుతూనే ఎయిర్‌పోర్టులో సీజ్‌ చేసిన విలువైన వస్తువులను విడిపించుకొనే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. ఈ మాట‌ల‌ను న‌మ్మిన స‌ద‌రు మ‌హిళ ఈ చీట‌ర్ అడిగిన‌ప్పుడ‌ల్లా తన వద్ద ఉన్న రూ.9.55 లక్షలను చీట‌ర్ ఖాతాలో వేసింది. ఆ డ‌బ్బంతా పోయిన త‌ర్వాత‌గానీ ఆమెకు పోలీసులు గుర్తుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: