ప్ర‌స్తుతం క‌రోనా బాధితుల‌ను కాపాడేందుకు ప్లాస్మ థెర‌పీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం పలు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ రోజు సాయంత్రం 4గంట‌ల‌కు కేంద్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ ప్లాస్మా థెర‌పీపై కీల‌క విష‌యాల‌ను చెప్పారు. దేశంలో ప్లాస్మా థెర‌పీ ప్ర‌యోగాత్మ‌కంగా జ‌రుగుతోందని, ప్లాస్మా థెర‌పీ క‌రోనాకు చికిత్స కాద‌ని ఆయ‌న అన్నారు. ప్లాస్మా థెరపీ ఇంకా పరీక్షించబడుతోందని, అయితే, దీనిని కొవిడ్ -19 చికిత్సగా ఉపయోగించవచ్చని ఎటువంటి ఆధారాలు లేవ‌ని, ఈ చికిత్సపై ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో జాతీయ స్థాయి అధ్యయనం కొన‌సాగుతోంద‌ని అగర్వాల్ చెప్పారు.

 

ప్లాస్మా థెర‌పీని కేవ‌లం ప‌రిశోధ‌న‌, ట్ర‌య‌ల్ కోస‌మే ఉప‌యోగించాల‌ని అన్నారు. ప్లాస్మా థెర‌పీని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించ‌క‌పోతే ప్రాణాంత‌కంగా మారే ప్ర‌మాదం కూడా ఉంద‌ని ల‌వ్ అగ‌ర్వాల్ హెచ్చ‌రించారు. కాగా, ఢిల్లీలో ఇప్ప‌టికే ప్లాస్మా థెర‌పీని ప్ర‌యోగాత్మ‌కంగా వైద్యులు అమ‌లుచేస్తున్నారు. క‌రోనా నుంచి కోలుకున్న‌వారు ప్లాస్మాను దానం చేయాల‌ని కూడా పిలుపునిచ్చారు. తాజాగా.. తెలంగాణ‌లో కూడా క‌రోనా పేషెంట్ల‌కు ప్లాస్మా థెర‌పీలో చికిత్స అందించేందుకు రెడీ అవుతున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: