ప్రాణాల‌కు తెగించి క‌రోనాపై పోరు సాగిస్తున్న వైద్య‌సిబ్బందిపై దాడులు ఆగ‌డం లేదు. వివ‌క్ష‌కు గుర‌వుతూనే ఉన్నారు. ఇటీవ‌ల వైద్యుల‌పై దాడుల‌ను అడ్డుకునేందుకు కేంద్రం ఏకంగాఆర్డినెన్స్ తీసుకొచ్చినా ప‌లువురి ఆలోచనా విధానంలో మార్పుమాత్రం రావ‌డం లేదు. తాజాగా.. ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్ జిల్లా మ‌కాన్‌పూర్ గ్రామంలో  కొవిడ్‌-19 స‌ర్వే కోసం వెళ్లిన మెడిక‌ల్ టీమ్‌పై స్థానికులు దాడికి పాల్ప‌డ్డారు. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. వారి చేతుల్లోని రిజిస్ట‌ర్ల‌ను లాక్కుని ఏకంగా ఆ పేజీల‌ను చించేశారు. తాము ఇంటింటి స‌ర్వే చేస్తుండ‌గా కొంద‌రు దాడికి పాల్ప‌డ్డార‌ని, ఒక మ‌హిళ త‌మ చేతిలో రిజ‌ష్ట‌ర్లు గుంజుకుని చించేసింద‌ని, ఈ ఘ‌ట‌న‌లో త‌మ‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయ‌ని అనిత అనే ఆశ వ‌ర్క‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్పందించారు. కొవిడ్‌-19 స‌ర్వేకు వెళ్లిన మెడిక‌ల్ టీమ్‌పై దాడి జ‌రిగిన‌ట్లు త‌మ‌కు ఫిర్యాదు అందింద‌ని, టీమ్‌లోని మ‌హిళ‌లప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా వారిపై భౌతిక దాడికి కూడా పాల్ప‌డిన‌ట్లు వారి ఫిర్యాదులో పేర్కొన్నార‌ని పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని, ప‌రారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామ‌ని వారు వెల్ల‌డించారు. కొత్త‌గా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్ర‌కారం నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: