ఏపీలో క‌రోనా రోజు రోజుకు కోరలు చాస్తోంది. ఓవైపు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం క‌రోనాతోనే క‌లిసి మ‌నం ప్ర‌యాణం చేయ‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఏపీలోనే క‌రోనా కేసులు గుంటూరు జిల్లాలోనే ఎక్కువుగా ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్‌ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. ఇక్క‌డ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా జోరుకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. 

 

చివ‌ర‌కు అక్క‌డ ప‌రిస్థితి చేయిదాటి పోతోంది. ఈ క్ర‌మంలోనే నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు.  పట్టణం చుట్టూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ప‌ట్ట‌ణం అంతా డ్రోన్ల‌తో నిఘా పెట్టారు. 

 

24 గంట‌లు అక్క‌డ గ‌స్తీ కాస్తున్నారు. చివ‌ర‌కు ఎస్పీ కేవ‌లం న‌ర‌సారావుపేట కోస‌మే ఇటీవ‌ల అద‌నంగా భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను కేటాయించారు. మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్‌ఐలు, 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లను నరసరావుపేటను 24 గంట‌లు జ‌ల్లెడ ప‌డుతున్నారు. వీళ్ల‌ను ఓ ఎస్పీ, ఇద్ద‌రు ఏఎస్పీలు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: