తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంద‌నుకుంటున్న త‌రుణంలో ఏదో ఒక ఘ‌ట‌న జ‌రుగుతోంది. తాజాగా.. సంగారెడ్డిలో ఐఐటీ భ‌వ‌న స‌ముదాయ నిర్మాణ ప‌నుల్లో పాల్గొంటున్న‌ సుమారు 1600మంది వ‌ల‌స‌కార్మికులు ఒక్క‌సారి ఒకేచోట‌కు వ‌చ్చారు. త‌మ‌ను సొంతూళ్ల‌కు పంపాలంటూ ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుంపులుగుంపులుగా ఒకేచోట‌కు చేరి ఆందోళ‌న‌కు దిగ‌డంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విష‌యం తెలియ‌గానే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌పైకి కార్మికులు తిర‌గ‌బ‌డ్డారు. రాళ్లు విసురుతూ దాడికి దిగారు.

 

ఇదే క్ర‌మంలో పోలీస్ వాహ‌నాన్ని ధ్వంసం చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. పోలీస్ వాహ‌నం పాక్షికంగా ధ్వంస‌మైంది. అంతేగాకుండా.. ఏఎస్సై కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కార్మికులు మాట్లాడుతూ.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అన్నంకూడా పెట్ట‌డం లేద‌ని, తాము ఇక్క‌డ ఎలా ఉండాల‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌కు సొంతూళ్ల‌కు పంపించాల‌ని డిమాండ్ చేశారు. పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో కార్మికులు ఆందోళ‌న విర‌మించుకున్నారు. ఈ ఘ‌ట‌నపై ప్ర‌భుత్వం ఆరాతీస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: