ఆయ‌న పేద‌ల డాక్ట‌ర్‌.. జీవితాంతం పేద‌ల కోసమే బ‌తికిన వైద్యుడు.. ఐదుద‌శాబ్దాల‌పాటు ల‌క్ష‌లాదిమందికి రెండు రూపాయ‌ల‌కే వైద్యం అందించిన మ‌న‌సున్న మారాజు! ఆయనే డాక్ట‌ర్ కేఎం ఇస్మాయిల్ హుస్సేన్‌‌.. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బాధితుల‌ను కాపాడేందుకు ప్రాణాల‌కు తెగించి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వైర‌స్ మ‌హ‌మ్మారి ఆయ‌న‌ను కూడా బ‌లితీసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌లు దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయారు. క‌ర్నూలు కేంద్రంగా ఉన్న మెడిక‌ల్ కాలేజీలో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేసిన డాక్ట‌ర్ సాహెబ్ దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా పేద‌ల‌కు వైద్య‌సేవలు అందించారు. ఒంట్లో జ‌బ్బుక‌న్నా.. చేతిలో డ‌బ్బును చూసే వైద్యులున్న ఈ రోజుల్లో.. డాక్ట‌ర్ ఇస్మాయిల్ ఏనాడు కూడా త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చే వారిని డ‌బ్బులు అడిగింది లేదు. క‌నీసం పేరు కూడా అడ‌గ‌లేదు. కేవ‌లం వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అడిగితెలుస‌కుని, వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ సేవ‌లందించారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాల‌క‌తీతంగా వైద్య‌సేవ‌లు అందించారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో ఆయ‌న రెండు రూపాయ‌ల డాక్ట‌ర్‌గా గుర్తింపు పొందారు. అయితే.. క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో ఆయ‌న సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ఏపీ స‌ర్కార్‌ కోరింది.

 

ఈ మేర‌కు ఆయ‌న‌  ఏప్రిల్ 10వ తేదీ రాత్రి వ‌ర‌కు క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందించేందుకు కృషి చేశారు. క‌ర్నూలులో త‌బ్లిఘీ జ‌మాత్‌కు వెళ్లిన వారిని గుర్తించేందుకు ఆయ‌న ఇంటింటికీ వెళ్లారని ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తు చేసుకున్నారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న కూడా వైర‌స్‌బారిన‌ప‌డి మృతి చెంద‌డం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయ‌న సేవ‌ల‌ను ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. డాక్ట‌ర్ ఇస్మాయిల్ జీవితాంతం మాన‌వీయ సేవ‌ల‌కే అంకిత‌మ‌య్యార‌ని ఈ సంద‌ర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కొనియాడారు. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత కర్నూలులో మత సామరస్యాన్ని నెల‌కొల్పేందుకు డాక్ట‌ర్ ఇస్మాయిల్ ఎంతో కృషి చేశార‌ని ఆయ‌న చెప్పారు. కులాలు, మాతాల‌కతీతంగా పేద‌రోగులంద‌రికీ వైద్య‌సేవ‌లు అందించార‌ని వెంక‌టేశ్ అన్నారు. పేద రోగుల కోసం సాయంత్రం ప్రాక్టీసు కొనసాగించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. నిజానికి క‌ర్నూలు ప‌ట్ట‌ణ ప్రాంతంలో 40శాతం ముస్లిం జనాభా ఉన్నా.. ఆయ‌నను ముస్లిం వైద్యుడిగా ఎవ‌రూ చూడ‌లేద‌ని, అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లకు ఆప్తుడిగానే ఉన్నార‌ని ప‌లువురు ప్ర‌ముఖులు గుర్తుచేసుకుంటున్నారు. లాక్‌డౌన్ లేకుంటే.. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు వేలాదిమంది హాజ‌ర‌య్యేవార‌ని కానీ.. క‌రోనా కార‌ణంగా అతన్ని అర్ధరాత్రి కేవలం ఐదారుగురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఖననం చేశారని ప‌లువురు అధికారులు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: