తెలంగాణ‌కు మంచి రోజులు రాబోతున్నాయి. క‌రోనా బారి నుంచి రాష్ట్రం బ‌య‌ట‌ప‌డబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మే 8 నాటికి తెలంగాణ కరోనారహిత రాష్ట్రంగా మారుతుంద‌ని ఆశాభావం వ్యక్తంచేశారు. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. బుధవారం ఎన్డీటీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా ర‌హిత‌ జిల్లాలు 11 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారందరూ అప్పటికి డిశ్చార్జి అవుతారని అంచనా వేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

 

కంటైన్మెంట్‌, క్వారంటైన్‌, రెడ్‌ జోన్లను సమర్థ‌వంతంగా అమలుపరుస్తున్నామని ఆయ‌న‌ చెప్పారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జీవితంతోపాటు జీతం కూడా ఎంతో ముఖ్యమని, ప్రజలకు అత్యవసరమైన సేవలు అందించడానికి అవసరమైన పరిశ్రమలను నడిపిస్తున్నామని ఆయ‌న అన్నారు. కాగా, నిన్న‌ కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. తాజాగా 35 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 409 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 582 మంది చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: