ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాజ్ భవన్ లో మరోసారి కరోనా కలకలం రేగింది. మూడు రోజుల క్రితం రాజ్ భవన్ లో నలుగురికి కరోనా నిర్ధారణ కాగా తాజాగా ఒక ఉద్యోగికి, ఆంబులెన్స్ డ్రైవర్ కు కరోనా సోకిందని సమాచారం. రాజ్ భవన్ లో ఇద్దరికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు వారి కుటుంబాలను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 
 
రెండు రోజుల క్రితం గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఇద్దరు అటెండర్లకు కరోనా నిర్ధారణ అయింది. రాజ్ భవన్ లో కరోనా కేసుల సంఖ్య 6కు చేరింది మరోవైపు ఏపీలో ఈరోజు 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1403కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. ఈ మూడు జిల్లాలల్లోనే 70 శాతం కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
కర్నూలు జిల్లాలో ఈరోజు 43 కరోనా కేసులు నమోదు కావడం జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 386కు చేరింది. గుంటూరులో ఈరోజు ఉదయం వరకు 287 కరోనా కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 246 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: