హైద‌రాబాద్‌లో పోలీసులు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు. అత్య‌వ‌స‌రంలేకున్నా.. ప‌దేప‌దే వాహ‌నాల‌తో రోడ్ల‌పైకి వ‌స్తున్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండుసార్లు పట్టుబడితే బండిని వదులుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రిస్తున్నారు. ప్రతి రోజూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సుమారు 2000 వాహనాల వరకు సీజ్‌ అవుతున్నాయి. ఇక లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి సుమారు 70 వేల వరకు సీజ్‌ అయ్యాయి. నిజానికి.. మొద‌ట్లో ఒకటి రెండు రోజులు వెహికిల్‌ను పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉంచి, త‌ర్వాత‌ వాహనదారుడికి ఇచ్చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు మరోసారి బయటకు రావద్దని, లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత కోర్టులో చార్జీషీట్‌ వేస్తే అప్పుడు న్యాయస్థానంలో హాజరుకావాలంటూ సూచిస్తూ... బండి ఆర్సీ, లైసెన్సులు ఒరిజనల్‌వి తమ వద్దే పెట్టుకొని వాహనాలను వదిలేశారు. అయినా ఒకసారి పట్టుబడిన కొందరిలో  మార్పు రాక‌పోవ‌డంతో పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

రెండో సారి కూడా అదే నిబంధలకు పాల్పడితే ఆ బండిని పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. నిజానికి.. లాక్‌డౌన్ స‌మ‌యంలో అత్యవసర స‌రుకుల కోసం ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోనే బైక్‌పై ఒకరు, కారులో అయితే ఒకరు లేదా ఇద్దరు తిరిగేందుకు అవకాశముంది. అయితే చాలా మంది దీనిని పాటించ‌డం లేదు. ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.  ఈ అప్లికేషన్‌ ద్వారానే హైదరాబాద్‌లో ప్రతి రోజూ ఉల్లంఘనదారులను పోలీసులు గుర్తిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: