కెనడాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. గ్రీస్, ఇటలీ దేశాల అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో పహరా కాస్తున్న నాటో నేవల్ టాస్క్‌ఫోర్స్ రాయల్ కెనడా నేవీ హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారని తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే.. ఈ మిలిటరీ హెలికాప్టర్ ఎందుకు కూలిపోయింది..? ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఇంకా తెలియడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని అంటున్నాయి. ఓ వైపు కరోనా వైరస్‌తో విలవిలాడుతున్న కెనడాలో ఈ ఘటనతో మరో విషాదం నెలకొంది. గల్లంతైన వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వారంతా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆ దేశ ప్రజలు కోరుతున్నారు.