ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజ్‌రౌలా ప్రాంతంలో ఓ అటవీ గ్రామంలో ఓ పులి వేర్వేరుగా దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయప‌ర్చింది. గజ్‌రౌలా గ్రామానికి చెందిన రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ అనే ముగ్గురు గ్రామస్తులు పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంట‌నే గాయపడినవారిని ద‌వాఖాన‌కు తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులిని పట్టుకొని ట్రాక్టరులో తీసుకువెళుతుండగా అది గ్రామస్థులపై దాడికి మ‌ళ్లీ యత్నించింది. ఈ క్రమంలో ట్రాక్టరుపై నుంచి పులి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. ఈ దాడి ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అదికాస్తా వైరల్ అయింది.

 

తమ ఇంటి ముందున్న పులి దారిన పోతున్న ముగ్గురిపై దాడి చేసిందని మిలాప్ సింగ్ అనే వ్య‌క్తి చెప్పాడు. పులి దాడి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు నాలుగు గంటల తర్వాత వచ్చారని.. పులులు తమ గ్రామంలోకి రాకుండా ఫెన్సింగ్ వేయాలని కోరినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గుర‌వుతున్నారు. అది మ‌ళ్లీ వ‌స్తుందేమోన‌ని బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: