తెలంగాణలో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు అంటే మే 8వ తేదీ నుంచి 21వ‌ర‌కు పొడిగించాలనే నిర్ణ‌యానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈనెల 7వ తేదీతో ముగియనుండగా.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈనెల 21 వరకు దానిని పొడిగించాలని ఆయ‌న‌ భావిస్తున్నట్టు స‌మాచారం. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ గడువును పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించాలనే అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

 

రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21న ముగియడాన్ని ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే.. ఈ నెల 5న అంటే మంగళవారం జరిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో దీనిపై పూర్తిస్థాయి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. రేప‌టి ఎజెండా కోసం ఈ రోజు కూడా మ‌రోసారి సమావేశం కావాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ పొడిగింపు, ఏయే రంగాలకు సడలింపు ఇవ్వాలనే అంశంపై మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: