పూణెలో విషాదం చోటుచేసుకుంది. క‌రోనా వైర‌స్‌బారిన ప‌డి 57 ఏళ్ల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) మృతి చెందారు.  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పూణె జాయింట్ పోలీస్ కమిషనర్ రవీంద్ర షిసావే మాట్లాడుతూ ఇప్పటివరకు 12 మంది పూణె పోలీసు సిబ్బంది క‌రోనా వైర‌స్‌బారిన ప‌డ్డార‌ని తెలిపారు. ఈ ప‌రిణామాల‌తో పోలీస్‌వ‌ర్గాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి మృతి చెందిన పోలీసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది.

 

కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య జెట్‌స్పీడ్‌తో పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 12974 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 548మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి మృతి చెందారు. ఇక ముంబైలో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగా, మహారాష్ట్ర నుంచి దాదాపు 35,000 మంది వ‌ల‌స‌ కార్మికులను త‌మ‌త‌మ సొంతూళ్ల‌కు పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వైద్య పరీక్షల త‌ర్వాత‌ కార్మికులను పంపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: