తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపున‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా..? అంటే విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. మ‌రికొన్ని రోజులు అంటే మే 28వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించే దిశ‌గానే ఈ రోజు కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నారు. నిజానికి.. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని క‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రోజు కేసులు ఎక్కువ‌గా.. మ‌రో రోజు త‌క్కువ‌గా న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌భుత్వం కూడా ఒక అంచ‌నాకు రాలేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని కేసీఆర్ ముందు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌రుగనున్న మంత్రివ‌ర్గ స‌మావేశంలో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌త మార్చి 22న రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్‌ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్‌డౌన్‌ అవసరమని  పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 70 రోజుల సైకిల్‌ పూర్తిచేయడమే మంచిద‌న‌ అని ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ 70 రోజుల సైకిల్ దాదాపుగా మే 28తో పూర్తవుతుంది. అందుకే కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. మ‌రింత ప్ర‌మాదం త‌ప్ప‌ద‌న్న అలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో ప్ర‌ధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లోనే అధికంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని నిన్న జరిగిన స‌మీక్షా స‌మావేశంలో సీఎం కేసీఆర్‌కు సిఫారసు చేశారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నిర్ణ‌యం కోసం తెలంగాణ స‌మాజం ఎదురుచూస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: